HIV ఇంజెక్ష‌న్ బాధితురాలి ఆత్మ‌హ‌త్య‌.. సెల్ఫీ వీడియో వైరల్

HIV ఇంజెక్ష‌న్ బాధితురాలి ఆత్మ‌హ‌త్య‌.. సెల్ఫీ వీడియో వైరల్

మేడ్చల్ జిల్లా పోచారంలో సంచలనం సృష్టించిన యువతి రమణి ఆత్మహత్య కేసు, ఆమె తీసుకున్న సెల్ఫీ వీడియోతో పెను సంచలనంగా మారింది. తనకు ఎయిడ్స్ ఉన్న రక్తాన్ని బలవంతంగా ఎక్కించి తన జీవితాన్ని నాశనం చేశాడంటూ ప్రియుడు మనోహర్‌పై ఆమె చేసిన ఆరోపణలు విన్న ఎవరికైనా కన్నీళ్లు ఆగవు. “నా జీవితాన్ని ఆగం చేశాడు.. గౌరవం లేని చోట నేను బ్రతకలేను” అంటూ ఓ యువతి తీసుకున్న సెల్ఫీ వీడియో ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపుతోంది. వరుసకు బావ అయ్యే వ్యక్తి ప్రేమ పేరుతో వంచించడమే కాకుండా, కక్షతో తనకు హెచ్ఐవి (HIV) సోకిన రక్తాన్ని ఇంజక్షన్ చేశాడన్న వార్త విస్తుగొలుపుతోంది.

ప్రేమ పేరుతో మోసం..
మృతురాలు రమణి తెలిపిన వివరాల ప్రకారం.. మనోహర్ అనే వ్యక్తి ఆమెకు వరుసకు బావ అవుతాడు. కొంతకాలంగా ఆమెను ప్రేమిస్తున్నానని వెంటపడ్డాడు. మొదట నిరాకరించినా, ఆ తర్వాత రమణి అతని ప్రేమను అంగీకరించింది. అయితే, మనోహర్ కానిస్టేబుల్ ఉద్యోగం కోసం మెడికల్ టెస్టులు చేయించుకున్న సమయంలో అతనికి హెచ్ఐవి పాజిటివ్ అని తేలింది. ఈ విషయం తెలిసినప్పటి నుండి రమణి అతనికి దూరంగా ఉంటూ వస్తోంది.

కుటుంబ సభ్యుల హెచ్చరిక..
2025లో తన అక్క పెళ్లి జరిగిన తర్వాత, రమణి ఈ విషయాన్ని తన ఇంట్లో చెప్పింది. అప్పుడు ఇద్దరికీ పరీక్షలు చేయించగా.. మనోహర్‌కు పాజిటివ్, రమణికి నెగిటివ్ అని వచ్చింది. “అతడిని పెళ్లి చేసుకుంటే నీ జీవితం నాశనం అవుతుంది” అని తల్లిదండ్రులు రమణిని హెచ్చరించారు. దీంతో ఆమె అతడికి పూర్తిగా దూరమై, మరో పెళ్లి సంబంధానికి అంగీకరించింది. తన‌ను కాదన్న కోపంతో మనోహర్ మృగంగా మారాడు. ఒకరోజు రమణి ఇంటికి వచ్చి, ఆమెను నమ్మించి బలవంతంగా ఓ ఇంజక్షన్ చేశాడు. తనకు ఉన్న ఎయిడ్స్ వ్యాధిని ఆమెకు కూడా అంటించాలనే క్రూరమైన ఆలోచనతోనే ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లు రమణి తన సెల్ఫీ వీడియోలో ఆవేదన వ్యక్తం చేసింది.

“ఇంజక్షన్ చేసిన రోజే నా స్నేహితురాలికి చెప్పాను. ఎలాగో ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన ఉండటంతో వెంటనే ఆసుపత్రికి వెళ్లలేదు. నాపై లేనిపోని ప్రచారాలు చేశారు, ఇక నేను బ్రతకలేను.” అని మృతురాలు రమణి సెల్ఫీ వీడియోలోని మాట్లాడిన మాట‌లు క‌ల‌చివేస్తున్నాయి.

పోలీసుల దర్యాప్తు
గౌరవంగా బ్రతకలేననే భయంతో రమణి తనువు చాలించింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు మనోహర్ చేసిన ఈ దారుణంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక యువతి జీవితాన్ని ఇంత కిరాతకంగా చిదిమేసిన మనోహర్‌ను కఠినంగా శిక్షించాలని రమణి కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment