రాష్ట్రంలో విచ్చలవిడిగా సాగుతున్న బెల్ట్ షాపుల (Belt Shops) దందా (Illegal Business) ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. నిబంధనలకు విరుద్ధంగా సాగుతున్న అధికార పార్టీ నేతల అండదండలతో సాగుతున్న బెల్ట్ షాపుల వేలం పాటలు (Auctions) సామాన్యుల పాలిట శాపంగా మారుతున్నాయి. నెల్లూరు జిల్లా దగదర్తి మండలం తడకలూరు గ్రామంలో చోటుచేసుకున్న ఈ దారుణ ఘటన స్థానికంగా పెను కలకలం రేపింది.
అసలేం జరిగిందంటే?
దగదర్తి మండలం తడకలూరు గ్రామంలో బెల్ట్ షాపు నిర్వహణ కోసం స్థానిక టీడీపీ(TDP) నేత, ఎమ్మెల్యే అనుచరుడు పేరం సతీష్ (అలియాస్ సాల్మన్) (Peram Satish alias Salman) ఏకంగా రూ. 2 లక్షలు వెచ్చించి వేలంలో దక్కించుకున్నాడు. అయితే, తాను పెట్టుబడి పెట్టిన బెల్ట్ షాపునకు సమీపంలో ఉన్న కల్లు పాక అడ్డుగా ఉందనే సాకుతో సతీష్ గొడవకు దిగాడు. “లక్షలు పోసి షాపు దక్కించుకుంటే.. నా వ్యాపారానికి నష్టం కలిగిస్తారా?” అంటూ ఆగ్రహంతో కల్లు పాకపై దాడికి తెగబడ్డాడు. ఈ క్రమంలో అక్కడ ఉన్న హజరత్తయ్య (Hazarathayya) అనే వ్యక్తి అడ్డుకోవడానికి ప్రయత్నించగా, సతీష్ అతనిపై విచక్షణారహితంగా దాడి చేసి, అందరి ముందూ అవమానకరంగా దూషించాడు.
అవమానం భరించలేక
నలుగురిలో జరిగిన అవమానాన్ని, భౌతిక దాడిని తట్టుకోలేక హజరత్తయ్య తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. కళ్లముందే జరిగిన అన్యాయాన్ని ఎదిరించలేక, అహంకారంతో చేసిన దాడితో కుంగిపోయిన ఆయన.. అనంతరం తన నివాసంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ వార్త తెలియడంతో గ్రామంలో ఒక్కసారిగా విషాద ఛాయలు అలముకున్నాయి.
గ్రామస్తుల ఆందోళన – ఉద్రిక్తత
హజరత్తయ్య మృతికి టీడీపీ (TDP) నేతల అరాచకాలే కారణమంటూ గ్రామస్తులు భారీ ఎత్తున ఆందోళనకు దిగారు. బెల్ట్ షాపుల పేరుతో సామాన్యుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని వారు మండిపడుతున్నారు. నిందితుడు పేరం సతీష్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయడంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఘటనపై సమాచారం అందుకున్న దగదర్తి పోలీసులు గ్రామానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. బాధితుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.








