బెంగాల్ రాజకీయాలు (Bengal Politics) ఎన్నికల ముందు మరింత ఉద్రిక్తంగా మారాయి. మాల్దా జిల్లాలో ‘స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్’ (SIR) ప్రక్రియలో పాల్గొన్న న్యాయాధికారులను గంటల తరబడి ముట్టడించిన ఘటనపై సుప్రీంకోర్టు (Supreme Court) తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన కోర్టు, పశ్చిమ బెంగాల్‌ను రాజకీయంగా విభజన చెందిన రాష్ట్రంగా వ్యాఖ్యానించడం చర్చనీయాంశంగా మారింది. ఓటర్ల జాబితా (Voter List) నుంచి పేర్లు తొలగింపుపై మొదలైన వివాదం ఈ స్థాయికి చేరుకోవడం పరిస్థితి తీవ్రతను సూచిస్తోంది.
ఈ ఘటనపై స్పందించిన సీఎం మమతా బెనర్జీ (Mamata Banerjee), దీనికి ప్రభుత్వంతో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ప్రజల్లో ఎస్ఐఆర్ ప్రక్రియపై (SIR process) ఉన్న ఆగ్రహావేశాలే కారణమని పేర్కొంటూ, మాల్దా ఘటన బీజేపీ(BJP) కుట్రలో భాగమని ఆరోపించారు. ఎన్నికల ముందు ఉద్రిక్తతలు సృష్టించి రాష్ట్రపతి పాలన (President’s Rule) విధించే ప్రయత్నం జరుగుతోందని విమర్శించారు. ఇదే సమయంలో ఎన్నికల సంఘంపై కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఓటర్ల జాబితా నుంచి పేర్ల తొలగింపుతో ప్రజల్లో అసంతృప్తి పెరుగుతుండగా, శాంతియుతంగా ఉండాలని మమతా ప్రజలకు పిలుపునిచ్చారు.








