ఏపీ ఎన్నికల ఫలితాలపై పరకాల ప్రభాకర్ సంచలన విశ్లేషణ

ఏపీ ఎన్నికల ఫలితాలపై పరకాల ప్రభాకర్ సంచలన విశ్లేషణ

భారత ఎన్నికల కమిషన్ (ECI) తీరు, ఈవీఎంల పనితీరు, ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) అసెంబ్లీ ఎన్నికల (Assembly Elections) పోలింగ్ సరళిపై (Polling Pattern) కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ (Nirmala Sitharaman) భ‌ర్త‌, ప్రముఖ ఆర్థిక, సామాజిక శాస్త్రవేత్త డాక్టర్ పరకాల ప్రభాకర్ (Parakala Prabhakar) తీవ్ర సందేహాలు వ్యక్తం చేశారు. ఢిల్లీలోని కాన్ స్టిట్యూషన్ క్లబ్ లో ‘భారత్ జోడో అభియాన్’ Bharat Jodo Abhiyan) ఆధ్వర్యంలో జరిగిన ‘ఎన్నికల సమగ్రతకు సవాళ్లు’ సదస్సులో ఆయన గణాంకాలతో సహా విస్తుపోయే అంశాలను వెల్లడించారు.

20 సెకన్లలో ఒక ఓటు.. ఇది సాధ్యమా?
ఏపీ ఎన్నికల పోలింగ్ రోజున (మే 13) అర్ధరాత్రి జరిగిన ఓటింగ్‌ ప్రక్రియపై పరకాల ప్రభాకర్ లాజికల్ ప్రశ్నలు సంధించారు. రాత్రి 11:45 నుంచి తెల్లవారుజామున 2 గంటల వరకు (అంటే 135 నిమిషాల్లో) సుమారు 17.19 లక్షల ఓట్లు పోలయ్యాయని ఏపీ సీఈవో(AP CEO) గణాంకాలు చెబుతున్నాయి. దీని ప్రకారం ఒక్కో బూత్‌లో సగటున నిమిషానికి ముగ్గురు ఓటు వేశారు. అంటే ఒక ఓటరుకు కేవలం 20 సెకన్లు మాత్రమే సమయం దొరికింది. వీవీప్యాట్ స్లిప్ రావడానికే 7 సెకన్లు పడుతుంది (అసెంబ్లీకి 7, లోక్‌సభకు 7 మొత్తం 14 సెకన్లు). మిగిలిన 6 సెకన్లలో గుర్తింపు కార్డు తనిఖీ, రిజిస్టర్ లో సంతకం, వేలికి సిరా పెట్టడం, రెండు ఓట్లు వేయడం ఎలా సాధ్యమని ఆయన ప్రశ్నించారు.

అనుమానాస్పదంగా పెరిగిన ఓటింగ్ శాతం
ఎన్నికల రోజు సాయంత్రం నుంచి తుది ఫలితాల వరకు ఓటింగ్ శాతంలో వచ్చిన మార్పులపై ప‌ర‌కాల ప్ర‌భాక‌ర్ విశ్లేషణ ఇలా ఉంది. మే 13 సాయంత్రం 5 గంటలకు 68.04% ఉన్న పోలింగ్, మే 17 నాటికి 80.66% కి చేరింది. అంటే ఈ 12.62% పెరుగుదల వల్ల అదనంగా 51.83 లక్షల ఓట్లు వచ్చి చేరాయి. ఈ అదనపు ఓట్లను 175 నియోజకవర్గాలకు పంచితే, ఒక్కో చోట సగటున 29,618 ఓట్లు పెరుగుతాయి. ఈ భారీ వ్యత్యాసం అభ్యర్థుల గెలుపోటములను పూర్తిగా తలకిందులు చేయగలదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

ఎన్నికల కమిషన్ పై విమర్శలు
ఈ సదస్సులో పాల్గొన్న సుప్రీంకోర్టు సీనీయర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ కూడా ఈసీ తీరును తప్పుబట్టారు. ఫామ్ 17సి (Form 17C) డేటాను వెబ్‌సైట్‌లో ఉంచడానికి ఈసీ ఎందుకు భయపడుతోందని ప్రశ్నించారు. ఈవీఎంలలో ‘టైమ్ బేస్డ్’ మ్యానిప్యులేషన్ జరిగే అవకాశం ఉందని, మాక్ పోలింగ్ సమయంలో బాగుండి, ఆ తర్వాత ఒకే పార్టీకి ఓట్లు పడేలా కోడ్ చేసే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఒకప్పుడు టీఎన్ శేషన్ హయాంలో నిష్పక్షపాతంగా ఉన్న ఈసీ, నేడు పాలకుల చేతిలో కీలుబొమ్మగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల తీర్పు అత్యంత సందేహాస్పదంగా ఉందని, ప్రజాస్వామ్య ప్రక్రియలో పారదర్శకత లోపిస్తే వ్యవస్థపై ప్రజలకు నమ్మకం పోతుందని పరకాల ప్రభాకర్ హెచ్చరించారు. త్వరలో జరగనున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో ఈ చర్చ ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రాధాన్యత సంతరించుకుంది.

Join WhatsApp

Join Now

Leave a Comment