తాడిప‌త్రిలో ఏడేళ్ల బాలుడి కిడ్నాప్ విషాదాంతం.. సొంత బావే హంత‌కుడు

తాడిప‌త్రిలో ఏడేళ్ల బాలుడి కిడ్నాప్ విషాదాంతం.. సొంత బావే హంత‌కుడు

అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గం యాడికి మండలంలో కలకలం రేపిన బాలుడి కిడ్నాప్ ఉదంతం విషాదాంతమైంది. కేవలం డబ్బు కోసం ఒక కిరాతకుడు తన సొంత బావమరిదినే పొట్టనబెట్టుకున్నాడు. ఏడేళ్ల పసివాడని కూడా చూడకుండా గొంతు నులిమి అత్యంత దారుణంగా హత్య చేసిన ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది.

అసలేం జరిగింది?
యాడికి మండలం కోన ఉప్పలపాడు గ్రామానికి చెందిన హేమచంద్ర (7) అనే బాలుడు బుధవారం సాయంత్రం పాఠశాల నుంచి ఇంటికి వస్తుండగా అదృశ్యమయ్యాడు. బాలుడు ఎంతకూ ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేపట్టగా, బాలుడిని అతని సొంత అక్క మొగుడు (బావ) సర్వేష్ కిడ్నాప్ చేసినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. ఇందుకు సంబంధించిన సీసీ ఫుటేజీ కూడా విడుద‌లైంది.

డబ్బు కోసమే ఈ ఘాతుకం
నిందితుడు సర్వేష్ జల్సాలకు అలవాటు పడి అప్పులు చేసినట్లు తెలుస్తోంది. సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో తన సొంత బావమరిది హేమచంద్రను కిడ్నాప్ చేసి, తల్లిదండ్రుల నుంచి భారీ మొత్తంలో డబ్బు డిమాండ్ చేయాలని ప్లాన్ వేశాడు. నిన్న సాయంత్రం బాలుడిని మాయమాటలతో తీసుకెళ్లి ఊరి శివార్లలోని అటవీ ప్రాంతానికి తరలించాడు.

గొంతు నులిమి హత్య
పోలీసులు తన కోసం గాలిస్తున్నారని, తాను దొరికిపోతాననే భయంతో సర్వేష్ అమానవీయంగా ప్రవర్తించాడు. పసివాడని కూడా చూడకుండా బాలుడి గొంతు నులిమి హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని అటవీ ప్రాంతంలోనే వదిలేసి పరారయ్యాడు. పోలీసులు బాలుడి ఆచూకీ కోసం గాలిస్తుండగా, నిర్జీవంగా పడి ఉన్న హేమచంద్ర మృతదేహం లభ్యమవడంతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. “ఒక చిన్నారిని అంత దారుణంగా చంపడానికి మనసెలా ఒప్పింది?” అంటూ స్థానికులు నిందితుడిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హేమచంద్ర తల్లిదండ్రులు తమ బిడ్డ ఇక లేడన్న వార్త విని గుండెలవిసేలా రోదిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment