రాష్ట్రంలో గ్యాస్ సిలిండర్ల (Gas Cylinders) కోసం జనం అల్లాడుతుంటే.. “కొరత లేదు, అంతా వదంతులే” అంటూ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ (Nadendla Manohar) చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతున్నాయి. క్షేత్రస్థాయిలో పరిస్థితి అత్యంత దారుణంగా ఉన్నా, మంత్రి మాత్రం అంకెలు చెపుతూ దాటవేత ధోరణిని ప్రదర్శిస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
మంత్రి గారూ.. ఈ ప్రశ్నలకు సమాధానం ఏది?
మంత్రి గారు చెబుతున్న లెక్కల ప్రకారం రోజుకు 2.4 లక్షల బుకింగ్స్ స్థానంలో 5 లక్షల బుకింగ్స్ అవుతున్నాయి. మరి పెరిగిన డిమాండ్‌కు తగ్గట్టుగా ఎన్ని సిలిండర్లు డెలివరీ (Cylinders Delivery) చేస్తున్నారో ఎందుకు చెప్పడం లేదని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. గ్యాస్ బుక్ చేసుకుని 20 రోజులు గడుస్తున్నా సిలిండర్ ఇంటికి రావడం లేదు. ఏజెన్సీల చుట్టూ తిరిగితే ‘నో స్టాక్’ (No Stock) బోర్డులే కనిపిస్తున్నాయని ఏ వీధిలోకి వెళ్లినా ప్రజలు చెబుతారు.
సామాన్యుడికి దొరకని సిలిండర్ బ్లాక్ మార్కెట్‌లో మాత్రం దర్శనమిస్తోంది. ఒక్కో సిలిండర్ రూ. 3,500 నుంచి రూ. 4,500 వరకు విక్రయిస్తున్నారనేది అందరూ అంగీకరించే వాస్తవం. గ్యాస్ కొరత లేదంటే మరి హోటల్స్, టిఫిన్ బండ్లు ఎందుకు మూతపడుతున్నాయని ప్రశ్నిస్తున్నారు. గ్యాస్ దొరక్క రాష్ట్రవ్యాప్తంగా వేల సంఖ్యలో చిన్న తరహా హోటళ్లు మూతపడ్డాయి. దీనివల్ల లక్షలాది మంది కార్మికులు ఉపాధి కోల్పోయారనేది కాదనలేని వాస్తవం.
సోషల్ మీడియాలో నెటిజన్ల ఫైర్
“వదంతులు నమ్మొద్దు” అని మంత్రి కోరడంపై సోషల్ మీడియాలో నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. “ఖాళీ సిలిండర్ పట్టుకుని గ్యాస్ బంకుల ముందు గంటల కొద్దీ నిలబడటం వదంతులా? హోటళ్లు మూతపడటం భ్రమలా?” అంటూ మంత్రిని నిలదీస్తున్నారు. తప్పుడు నివేదికలను నమ్మి మంత్రి అబద్ధాలు చెబుతున్నారా? లేక ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారా? అని వినియోగదారులు మండిపడుతున్నారు. ఇప్పటికైనా వాస్తవాలను గుర్తించి, యుద్ధప్రాతిపదికన గ్యాస్ సరఫరాను పునరుద్ధరించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.








