తెలంగాణలో పెట్రోల్ బంక్‌ల దగ్గర భారీగా క్యూలు వెలిశాయి. పెట్రోల్ బంక్‌లు మూసివేస్తారన్న వదంతులతో జనం పరుగులు పెడుతున్నారు.. నిన్నటి నుంచి పెట్రోల్ కోసం వాహనదారులు బారులు తీరారు. గ్రేటర్ హైదరాబాద్‌లో చాలా చోట్ల పెట్రోల్ బంక్‌లు క్లోజ్ అయ్యాయి.. ఆయిల్ కంపెనీలు క్రెడిట్ ఇవ్వడం మానేయడంతో మూతపడ్డాయి. దీంతో జనాలు ఒక్కసారిగా పానిక్ అవుతున్నారు.
బుధవారం తెల్లవారుజామున నగరంలోని పలు పెట్రోల్ బంకులు వాహనదారులతో కిటకిటలాడాయి. పెద్ద ఎత్తున క్యూలు ఉండటంతో భారీగా ట్రాఫిక్ జామ్‌లు అవుతున్నాయి. ఇక ఎల్‌పీజీ, సీఎన్‌జీ ఆటోల పరిస్థితి మరింత దారుణంగా మారింది. బంకుల ముందు ఆటోలు నిలబెట్టి పడిగాపులు కాస్తున్నారు.
అయితే.. పెట్రోల్ బంకులు మూసివేయడానికి ఆయిల్ కంపెనీలు పెట్టిన కొత్త మెలిక కారణమని బంకుల యజమానులు చెబుతున్నారు. చేతిలో నగదు లేక చాలా మంది డీలర్లు పెట్రోల్, డీజిల్ కొనడం ఆపేశారు. ఇంతకుముందు ఆయిల్ కంపెనీలు క్రెడిట్ ఇచ్చేవి. అయితే ఈ నెలలో క్రెడిట్ సదుపాయం ఇవ్వకపోవడంతో డీలర్లు బంకులను మూసివేసే పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కొరత లేదు. అయితే మార్చి 31తో ఆర్థిక సంవత్స4రం ముగియనున్న నేపథ్యంలో పెట్రోలియం కంపెనీలు డీలర్లకు ఇప్పటివరకు ఇస్తున్న క్రెడిట్ సదుపాయాన్ని పూర్తిగా తొలగించాయి. దీంతో డీలర్లు డబ్బులు చెల్లిస్తేనే ఆయిల్ కంపెనీలు పెట్రోల్, డీజిల్‌లను సరఫరా చేస్తున్నాయి.








