కోనసీమలో కుల వివక్ష.. మరణంలోనూ తప్పని అవమానం (Video)

కోనసీమలో కుల వివక్ష.. మరణంలోనూ తప్పని అవమానం (Video)

ఆధునిక సమాజంలో ఇంకా కుల వివక్ష కోరలు చాస్తూనే ఉంది. సాక్షాత్తు రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ (Ambedkar) పేరున్న కోన‌సీమ జిల్లాలోనే దళితులకు తీరని అవమానం ఎదురైంది. చనిపోయిన వ్యక్తి అంతిమ యాత్రను అడ్డుకోవడమే కాకుండా, వారి సామాజిక వర్గం కోసం నిర్మించిన రోడ్డుపైనే వారిని వెళ్లనీయకుండా అగ్రవర్ణాల వ్యక్తులు అడ్డుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

అసలేం జరిగిందంటే..?
పి.గన్నవరం మండలం (P. Gannavaram Mandal) కందాలపల్లి గ్రామానికి (Kandlapalli Village) చెందిన కాట్రు శ్రీనివాస్ (Katru Srinivas) అనే వ్యక్తి ఈ నెల 16న మరణించారు. అంబేడ్కర్ నగర్‌లో నివసించే ఆయన కుటుంబ సభ్యులు, బంధువులు అంతిమ యాత్రను (Funeral Procession) ప్రారంభించారు. గ్రామంలోని అంబేడ్కర్ నగర్ నుంచి ప్రధాన రోడ్డుపైకి శవాన్ని తీసుకువెళ్తుండగా, స్థానిక అగ్రవర్ణాలకు చెందిన కొందరు వ్యక్తులు అడ్డుతగిలారు. తమ ఇళ్ల ముందు నుంచి శవాన్ని వెళ్లనీయబోమని వారితో వాగ్వాదానికి దిగారు.

ఎస్సీ సబ్ ప్లాన్ రోడ్డుపైనే ఆంక్షలా?
విషాదకరమైన విషయం ఏమిటంటే.. ఏ రోడ్డుపై అయితే అంతిమ యాత్రను అడ్డుకున్నారో, అది ఎస్సీ సామాజిక వర్గం కోసం కేటాయించిన ‘ఎస్సీ సబ్ ప్లాన్’ (SC Sub Plan) నిధులతో నిర్మించిన రోడ్డు. తమ కోసం వేసిన రోడ్డుపైనే తమను వెళ్లనీయకపోవడంతో బాధితులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం జరగడంతో గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది.

పొలాల్లోంచి అంతిమ యాత్ర..
అడ్డుకున్న వారితో గొడవ పడలేక, చివరకు గత్యంతరం లేని పరిస్థితుల్లో ఎస్సీ సామాజిక వర్గీయులు శ్రీనివాస్ శవాన్ని పొలాల గుండా మోసుకెళ్లాల్సి వచ్చింది. మరణంలోనూ తమకు వివక్ష ఎదురుకావడంపై స్థానికులు కన్నీరుమున్నీరయ్యారు. ఈ ఘటనపై దళిత సంఘాలు, సామాజిక వర్గ నేతలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. అంతిమ యాత్రకు అడ్డంకులు సృష్టించి, కుల వివక్షకు పాల్పడినట్లు నిర్ధారణ కావడంతో గ్రామానికి చెందిన 10 మందిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment