మెగాస్టార్‌పై టీడీపీ శ్రేణుల బూతులు.. జన సైనికుల మౌనం

మెగాస్టార్‌పై టీడీపీ శ్రేణుల బూతులు.. జన సైనికుల మౌనం

గద్దర్ అవార్డుల (Gaddar Awards) వేదికగా మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయి. సినిమా కళాకారులను ప్రోత్సహించే విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (Andhra Pradesh Government) వెనుకబడి ఉందంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు, అధికార తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) శ్రేణులకు ఆగ్రహం తెప్పించాయి. దీంతో సోషల్ మీడియా వేదికగా చిరంజీవిపై టీడీపీ యాక్టివిస్టులు ఇష్టారీతిగా బూతులు తిడుతూ పోస్టులు పెడుతున్నారు.

చిరంజీవి ఏమన్నారంటే..?
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన గద్దర్ అవార్డుల కార్యక్రమంలో చిరంజీవి మాట్లాడుతూ.. కొత్త తరాన్ని, కళాకారులను ప్రోత్సహించడంలో తెలంగాణ ప్రభుత్వం ముందుందని కొనియాడారు. ఇదే క్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) కూడా రేవంత్ రెడ్డి (Revanth Reddy) ప్రభుత్వాన్ని స్ఫూర్తిగా తీసుకుని, కళాకారులను ఉత్సాహపరిచేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఏపీలో ఈ విషయంలో కొంత వెనుకబాటుతనం కనిపిస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు.

చిరంజీవిపై బూతులతో పోస్టులు
చిరంజీవి వ్యాఖ్యలపై టీడీపీ సోషల్ మీడియా వింగ్ (TDP Social Media Wing) తీవ్రంగా స్పందిస్తోంది. టికెట్ల రేట్ల కోసం సాగిలపడ్డ విషయాన్ని గుర్తు చేస్తూ.. ఇష్టారీతిగా వ్య‌క్తిత్వాన్ని కించ‌ప‌రిచేలా పోస్టులు పెడుతున్నారు. “షూటింగులు చేయడానికి ఏపీకి రారు, హైదరాబాద్ వదలరు.. కానీ మీ కోసం కోట్లు ఖర్చు పెట్టి సంబరాలు చేయాలా?” అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. పరోక్షంగా పవన్ లక్ష్యంగా చేసుకొని కూడా వ్యాఖ్య‌లు చేస్తున్నారు. ఏపీలో టికెట్ల రేట్లు పెంచుకోవ‌డం త‌ప్ప మీరు చేస్తుంది ఏంటీ..? అని ప్ర‌శ్నిస్తున్నారు. చిరంజీవిని వ్యక్తిగతంగా దూషిస్తూ, ఆయనకు ‘వ్యక్తిత్వం లేదంటూ’ బండబూతులు తిడుతూ చేస్తున్న పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

జనసైనికుల ‘మౌనం’
సాధారణంగా మెగా ఫ్యామిలీపై లేదా చిరంజీవిపై చిన్న విమర్శ వచ్చినా సోషల్ మీడియాను షేక్ చేసే జనసైనికులు (Jana Sainiks), మెగా అభిమానులు.. ఈసారి మాత్రం మౌనంగా ఉండటం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్(Pawan Kalyan) కీలకంగా ఉండటం వల్లే జనసైనికులు కిక్కురుమ‌న‌కుండా ఉన్నారా..? గ‌తంలో జ‌గ‌న్ (YS Jagan) ఇంటికి పిలిచి భోజ‌నం పెట్టినా, దండం పెట్ట‌లేదంటూ మార్ఫింగ్ వీడియోల‌తో నానా యాగీ చేసిన జ‌న సైనికులు.. టీడీపీ సోష‌ల్ మీడియా యాక్టివిస్టులు చిరంజీవిని ఇష్టారీతిగా, నోటికి వ‌చ్చిన‌ట్టుగా తిడుతున్నా.. మిన్న‌కుండిపోవ‌డం గ‌మ‌నార్హం. త‌న అన్న‌కు దండం పెట్ట‌లేద‌ని వేదిక‌ల‌పై జ‌గ‌న్‌ను తూల‌నాడిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. ఇప్పుడు తాను పొత్తులో ఉన్న టీడీపీ శ్రేణులు నానా మాట‌లు అంటూ రెచ్చిపోతుంటే.. క‌నీసం త‌న పార్టీ త‌ర‌ఫు నుంచి వారిని కంట్రోల్ చేయించ‌లేక‌పోవ‌డం ఆశ్చ‌ర్యం క‌లిగిస్తోంది.

మొత్తానికి చిరంజీవి చేసిన ‘ప్రోత్సాహం’ వ్యాఖ్యలు ఇప్పుడు రెండు పార్టీల మధ్య సోషల్ మీడియా వేదికగా చిచ్చు పెట్టాయి. మరి ఈ వివాదంపై అటు ప్రభుత్వం కానీ, ఇటు మెగా క్యాంప్ కానీ ఎలా స్పందిస్తుందో చూడాలి.

Join WhatsApp

Join Now

Leave a Comment