డ్రగ్ టెస్ట్‌కు సిద్ధమ‌న్నా.. ఎందుకు జరగలేదు? కేటీఆర్ ఫైర్‌


మొయినాబాద్ డ్రగ్స్ కేసుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. పైలట్ రోహిత్ రెడ్డి చేసిన తప్పుపై పార్టీ ఇప్పటికే చర్యలు తీసుకుందని తెలిపారు. ఆయనకు షోకాజ్ నోటీసులు జారీ చేసి తాత్కాలికంగా సస్పెండ్ చేసినట్లు వెల్లడించారు. తాను డ్రగ్ టెస్ట్‌కు సిద్ధమని చెప్పానని, కానీ అది ఎందుకు ముందుకు సాగలేదో ప్రశ్నించారు.

రాజీనామాపై సవాల్.. ప్రభుత్వంపై విమర్శలు
హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడిన కేటీఆర్, వడ్డీలేని రుణాల అంశంపై కూడా స్పందించారు. వడ్డీలేని రుణాలు ఇచ్చినట్లు ఆధారాలు చూపిస్తే తాను రాజీనామా చేస్తానని చెప్పారు. సభను తప్పుదోవ పట్టించిన వారు రాజీనామా చేయాలా లేక తానే చేయాలా అని ప్రశ్నించారు. తాను చెప్పిన మాటకు కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు.

మాజీ మంత్రి జీవన్ రెడ్డి విషయంలో తమకు ఎలాంటి చర్చలు జరగలేదని చెప్పారు. అలాగే కేసీఆర్ ఎప్పుడు, ఎక్కడికి రావాలో ఆయనకు తెలుసని వ్యాఖ్యానించారు. పార్టీ మారి ఇతర పార్టీల తరఫున పోటీ చేసిన వారిపై ప్రభుత్వం స్పందించకపోవడాన్ని కూడా విమర్శించారు.

మూసీ ప్రాజెక్టు, హ్యామ్ రోడ్లపై అవినీతి ఆరోపణలపై తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విచారణ చేపడతామని తెలిపారు. నిషేధిత భూముల అంశంపై మంత్రి ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. మూసీ ప్రాజెక్టు విషయంలో మంత్రుల కంటే అధికారులు ఎక్కువగా మాట్లాడుతున్నారని కేటీఆర్ ఆరోపించారు. ప్రణాళిక, నిధులు లేకుండానే ఇండ్లు కూల్చివేస్తున్నారని ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment