సోషల్ మీడియా దిగ్గజం ‘మెటా'(Meta) (ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ మాతృసంస్థ) మరోసారి ఉద్యోగుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. 2022-23లో జరిగిన ‘ఇయర్ ఆఫ్ ఎఫిషియన్సీ’ (Year of Efficiency) కంటే కూడా భారీ స్థాయిలో ఈసారి కోతలు ఉండబోతున్నాయని అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. ఈసారి ఏకంగా 20 శాతం మంది ఉద్యోగులను తొలగించాలని మార్క్ జుకర్బర్గ్ (Mark Zuckerberg) భావిస్తున్నట్లు సమాచారం.
15,800 మందిపై వేటు?
ప్రస్తుతం మెటాలో దాదాపు 79,000 మంది ఉద్యోగులు ఉండగా, తాజా ప్రణాళిక ప్రకారం 15,800 కంటే ఎక్కువ మంది ఉద్యోగాలను కోల్పోయే ప్రమాదం ఉంది. ఇప్పటికే సీనియర్ నాయకత్వానికి ఈ మేరకు సంకేతాలు అందాయని, వచ్చే నెలలోనే ఈ ప్రక్రియ ప్రారంభం కావచ్చని తెలుస్తోంది. మెటా చరిత్రలో ఇదే అతిపెద్ద లేఆఫ్ రౌండ్ కానుంది.
ఎందుకీ కోతలు? కారణాలు ఇవే..
ఈ భారీ లేఆఫ్స్ (Layoff) వెనుక రెండు ప్రధాన కారణాలు కనిపిస్తున్నాయి. మెటా తన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సామర్థ్యాన్ని పెంచుకోవడానికి విపరీతంగా ఖర్చు చేస్తోంది. 2028 నాటికి డేటా సెంటర్ల నిర్మాణం కోసం $600 బిలియన్లు (సుమారు రూ. 50 లక్షల కోట్లు) కేటాయించింది. 2026లో ఈ వ్యయం గత ఏడాది కంటే రెట్టింపు (సుమారు $135 బిలియన్లు) కానుంది. గతంలో పెద్ద టీమ్లు చేసే పనులను ఇప్పుడు ఒక్క ప్రతిభావంతుడైన వ్యక్తి AI సాయంతో చేయగలుగుతున్నారని జుకర్బర్గ్ నమ్ముతున్నారు. అందుకే పనితీరును మెరుగుపరిచి (Performance Improvement), సిబ్బంది సంఖ్యను తగ్గించాలని చూస్తున్నారు.
ఇతర సంస్థల బాటలోనే మెటా
కేవలం మెటా మాత్రమే కాదు, టెక్ ప్రపంచంలో (Tech Industry) లేఆఫ్స్ జోరుగా సాగుతున్నాయి. అమెజాన్ జనవరిలో 16,000 మందిని (10%) తొలగించింది. బ్లాక్ ఏకంగా సగం మంది సిబ్బందిని తొలగిస్తూ జ్యాక్ డోర్సీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. దీనికి కూడా AI వినియోగమే కారణమని పేర్కొన్నారు.
‘అవోకాడో’ మోడల్ నిరాశ.. పెరుగుతున్న ఒత్తిడి
ఒకవైపు వేల కోట్ల పెట్టుబడులు పెడుతున్నా, మెటా కొత్త AI మోడల్ ‘అవోకాడో’ (Avocado) ఇంటర్నల్ టెస్టుల్లో ఆశించిన ఫలితాలను ఇవ్వడం లేదు. గూగుల్ Gemini 3.0 వంటి ప్రత్యర్థులతో పోలిస్తే ఇది వెనుకబడి ఉందని సమాచారం. మార్చిలో రావాల్సిన ఈ మోడల్ ఇప్పుడు మే నెలకు వాయిదా పడింది. అలెగ్జాండర్ వాంగ్ నేతృత్వంలోని ఎలైట్ టీమ్ ‘TBD Lab’పై ఇప్పుడు తీవ్ర ఒత్తిడి నెలకొంది.
మెటా స్పందన
ఈ వార్తలపై మెటా ప్రతినిధి ఆండీ స్టోన్ స్పందిస్తూ.. ఇవి కేవలం ఊహాగానాలేనని కొట్టిపారేశారు. అయితే, ఈ తొలగింపులపై అంతర్గతంగా చర్చలు జరుగుతున్నాయనే విషయాన్ని ఆయన పూర్తిగా తోసిపుచ్చలేదు.








