యుద్ధం ఎక్కడో జరుగుతోంది.. కానీ దాని వేడి మాత్రం మన వంటింట్లో కనిపిస్తోంది. ఇరాన్-ఇజ్రాయెల్ (Iran-Israel) మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు ప్రపంచ దేశాలను వణికిస్తుంటే, భారత్ (India) లాంటి దేశాల్లోని సామాన్యులు ‘ఆర్థిక యుద్ధాన్ని’ (Economic War)’ ఎదుర్కొంటున్నారు. గ్యాస్ సిలిండర్ ధర (Gas Cylinder) నుంచి గల్ఫ్ ఉద్యోగాల వరకు (Gulf Jobs). రూపాయి విలువ (Rupee Value) నుంచి బంగారం ధరల (Gold Prices) వరకు ప్రతిదీ ఈ యుద్ధ ప్రభావంతో అల్లకల్లోలమవుతోంది.
పెరిగిన గ్యాస్ ధరలు
భారతదేశం తన వంట గ్యాస్ (LPG) అవసరాల కోసం 90% గల్ఫ్ దేశాలపైనే ఆధారపడుతోంది. యుద్ధం కారణంగా సముద్ర మార్గమైన ‘స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్’ మూతపడటంతో సరఫరా నిలిచిపోయింది. సిలిండర్‌పై దాదాపు రూ.60 అదనపు భారం పడింది. కమర్షియల్ గ్యాస్ (Commercial LPG) కొరతతో రెస్టారెంట్లలో భోజనం ధరలు పెరిగాయి.
పెట్రోల్, డీజిల్ సెగ
ముడిచమురు ధరలు బ్యారెల్‌కు 120 డాలర్లు దాటడంతో మన దేశంలో పెట్రో ధరలు పెరగడం అనివార్యమైంది. చమురు ధరలు పెరిగితే ఆ ప్రభావం నేరుగా రవాణా ఖర్చులపై పడుతుంది. రవాణా ఖర్చులు పెరగడంతో కూరగాయలు, పప్పు దినుసులు, నూనె ప్యాకెట్ల ధరలు 10-15% పెరిగాయి. సామాన్యుడి నెలవారీ బడ్జెట్ తలకిందులైంది.
స్టాక్ మార్కెట్ పతనం
యుద్ధం తెచ్చిన అనిశ్చితితో విదేశీ పెట్టుబడిదారులు (FIIs) భారత మార్కెట్ల (Stock Market) నుంచి నిధులను ఉపసంహరించుకుంటున్నారు. మార్చి మొదటి రెండు వారాల్లోనే దాదాపు రూ.25,000 కోట్లు వెనక్కి వెళ్లాయి. మ్యూచువల్ ఫండ్స్, షేర్లలో ఇన్వెస్ట్ చేసిన మధ్యతరగతి ప్రజల పోర్ట్‌ఫోలియోలు ఎర్రబడ్డాయి. సాధారణంగా పెరగాల్సిన బంగారం, వెండి ధరలు కూడా ప్రస్తుతం నేలచూపులు చూస్తుండటం గమనార్హం.
గల్ఫ్ ఉద్యోగాలకు ఎసరు
గల్ఫ్ దేశాల్లో సుమారు 90 లక్షల మంది భారతీయులు పని చేస్తున్నారు. యుద్ధం వల్ల అక్కడ ఫ్యాక్టరీలు మూతపడటంతో తెలుగు వారు సహా అనేక మంది ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉందని అల్ జజీరా నివేదికలు చెబుతున్నాయి. ఇది దేశానికి వచ్చే రెమిటెన్సులపై (విదేశీ నగదు) దెబ్బతీస్తుంది.
రైతుపై ఎరువుల భారం
వ్యవసాయానికి వాడే యూరియా, డీఏపీ (DAP) వంటి ఎరువుల్లో సగం గల్ఫ్ దేశాల నుంచే వస్తాయి. సప్లై చైన్ దెబ్బతినడంతో ఎరువుల ధరలు 30-40% పెరిగే అవకాశం ఉంది. ఇది అంతిమంగా బియ్యం, గోధుమల వంటి ఆహార ధాన్యాల ధరలు పెరగడానికి దారితీస్తుంది.
పతనమవుతున్న రూపాయి.. పెరిగిన విద్యార్థుల భారం
అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ చారిత్రక కనిష్టానికి (రూ.91-93) పడిపోయింది. US, UK వంటి దేశాల్లో చదువుకుంటున్న విద్యార్థుల ఫీజులు భారీగా పెరిగాయి. తల్లిదండ్రులపై ఆర్థిక భారం మోయలేనంతగా పెరిగింది. అంతర్జాతీయ పరిస్థితులు చక్కబడే వరకు ఈ ఆర్థిక ఒత్తిడి తప్పదు. ప్రభుత్వం సబ్సిడీలతో కొంత ఆదుకుంటున్నప్పటికీ, సామాన్యులు తమ నెలవారీ ఖర్చులను జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాల్సిన సమయం ఇది.








