తిరువూరులో రాజకీయ వేడి మరోసారి ఆలయ ప్రాంగణానికే చేరింది. గంపలగూడెం నెమలి శ్రీవేణుగోపాలస్వామి బ్రహ్మోత్సవాల్లో ఎంపీ కేశినేని, ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు మధ్య వివాదం చెలరేగింది. స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించే కార్యక్రమంలో ఇద్దరి మధ్య పంచాయితీ మొదలై, ఒక్కసారిగా ఉద్రిక్తతకు దారితీసింది. భక్తుల సమక్షంలోనే ఈ ఘటన చోటుచేసుకోవడం చర్చనీయాంశమైంది.
సాక్షుల ప్రకారం, ఎంపీ కేశినేని చిన్ని చేతుల్లో ఉన్న పట్టు వస్త్రాలను ఎమ్మెల్యే కొలికపూడి లాక్కోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. వెంటనే చిన్ని వర్గీయులు అడ్డుకునేందుకు ప్రయత్నించగా తోపులాట వాతావరణం నెలకొంది. ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు అయోమయానికి గురయ్యారు. పరిస్థితి అదుపు తప్పకుండా పోలీసులు అప్రమత్తమై మధ్యవర్తిత్వం చేశారు.
ఇద్దరి మధ్య విభేదాలు కొత్తవి కావు. గత కొంతకాలంగా ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ వస్తున్నారు. ఎమ్మెల్యే సీటు వ్యవహారంలో రూ.5 కోట్లు తీసుకున్నారని కొలికపూడి ఆరోపించగా, తనపై జరుగుతున్న అవమానాల గురించి పార్టీ అధిష్ఠానానికి ఫిర్యాదు చేసినట్టు సమాచారం. ఈ రాజకీయ విభేదాలే ఇప్పుడు ఆలయ కార్యక్రమంలో బయటపడ్డాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఇటీవల కొలికపూడి చేసిన సోషల్ మీడియా పోస్టులు కూడా వైరల్‌గా మారాయి. గంపలగూడెం టీడీపీ మండల పార్టీ అధ్యక్షుడు మానుకొండ రామకృష్ణ పాత ఫోటోను షేర్ చేస్తూ విమర్శలు గుప్పించారు. “బంగారు కొండ.. మానుకొండ” అంటూ చేసిన వ్యాఖ్యలు తిరువూరులో రాజకీయ చర్చలకు దారితీశాయి. ఈ పోస్టులు ఎంపీ వర్గానికి ఆగ్రహాన్ని తెప్పించాయి.
స్వామివారి బ్రహ్మోత్సవాల సమయంలో చోటుచేసుకున్న ఈ ఘటనతో తిరువూరు రాజకీయాలు మరింత వేడెక్కాయి. పార్టీ అంతర్గత విభేదాలు బహిరంగంగా బయటపడటంపై నాయకత్వం ఎలా స్పందిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.








