క్రిస్మస్ పండుగ ఉత్సవాల మధ్య జర్మనీలోని మాగ్డెబర్గ్ క్రిస్మస్ మార్కెట్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. తాలెబ్.ఎ అనే ముస్లిం యువకుడు తన కారును వేగంగా నడిపి, ఉత్సవాల్లో పాల్గొన్న వారిపైకి దూసుకొచ్చాడు. ఈ దాడిలో తొమ్మిదేళ్ల చిన్నారి సహా మొత్తం ఐదుగురు మరణించగా, గాయపడిన 200మందిలో ఏడుగురు భారతీయులు ఉన్నారు.
గాయపడిన వారిలో ముగ్గురు ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ కాగా, మిగిలిన నలుగురు చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో గాయపడిన భారతీయులందరితో భారత రాయబార కార్యాలయం ప్రతినిధులు మాట్లాడి, వారికి సహాయం అందిస్తున్నారు. వారి కుటుంబాలకు అన్ని విధాలుగా అండగా నిలుస్తామని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.
భారత్ ఖండన
ఈ దాడిని భారత విదేశాంగ శాఖ తీవ్రంగా ఖండించింది. ఈ దుర్ఘటనలో ప్రాణ నష్టంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గాయపడిన వారి చికిత్సకు అవసరమైన సహాయాన్ని అందించేందుకు అన్ని చర్యలు చేపడుతున్నట్లు వివరించింది.
సీసీ ఫుటేజ్ ఆధారంగా విచారణ
సీసీ ఫుటేజ్ ఆధారంగా తాలెబ్.ఎ 400 మీటర్ల దూరం వరకు కారుతో ఈడ్చుకెళ్లిన దృశ్యాలు కనిపించాయి. పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. గాయపడిన వారిలో చాలా మంది పరిస్థితి ఇంకా విషమంగా ఉందని స్థానిక నివేదికలు తెలియజేశాయి.








