జాతీయ స్థాయిలో పరస్పర ప్రత్యర్థులుగా ఉన్న కాంగ్రెస్-బీజేపీ పార్టీలపై రంగారెడ్డి జిల్లా ఆమనగల్ మున్సిపాలిటీలో రాజకీయంగా ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. స్థానిక సంస్థలో అధికారం దక్కించుకునే ప్రయత్నాల్లో ఈ రెండు పార్టీలు కలిసివచ్చాయన్న ఆరోపణలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి.
ఆమనగల్ మున్సిపాలిటీలో మొత్తం 15 వార్డులు ఉండగా, ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీ 8 వార్డుల్లో విజయం సాధించి అతిపెద్ద పార్టీగా నిలిచింది. బీజేపీ 6 వార్డులు గెలుచుకోగా, కాంగ్రెస్ ఒక వార్డుకు మాత్రమే పరిమితమైంది. లెక్కల ప్రకారం చూస్తే, ఎక్కువ మంది కౌన్సిలర్లు ఉన్న బీఆర్‌ఎస్‌కు చైర్మన్ పదవి దక్కాల్సి ఉంది.
అయితే ఎక్స్ అఫిషియో ఓట్ల సమీకరణంతో పరిస్థితి మారే అవకాశం కనిపిస్తోంది. కాంగ్రెస్‌కు కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి మరియు నాగర్‌కర్నూల్ ఎంపీ మల్లు రవి రూపంలో రెండు ఎక్స్ అఫిషియో ఓట్లు ఉన్నాయి. దీంతో కాంగ్రెస్ బలం మూడు ఓట్లకు పెరుగుతుంది. ఈ ముగ్గురు సభ్యులకు బీజేపీకి చెందిన ఆరుగురు కౌన్సిలర్లు మద్దతు ఇస్తే మొత్తం సంఖ్య తొమ్మిదికి చేరుతుంది. అలా జరిగితే ఎనిమిది మంది కౌన్సిలర్లు ఉన్న బీఆర్‌ఎస్‌కు అధికారం దూరమయ్యే పరిస్థితి ఏర్పడుతుంది.
ఈ నేపథ్యంలో బీజేపీ, కాంగ్రెస్ మధ్య స్థానిక స్థాయిలో అవగాహన ఏర్పడిందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ముఖ్యంగా బీజేపీకి ఆరుగురు సభ్యులు ఉన్నప్పటికీ, ఒక్క కౌన్సిలర్ మాత్రమే ఉన్న కాంగ్రెస్‌కు చైర్మన్ పదవి ఇవ్వడానికి సిద్ధమైనట్లు సమాచారం రావడం రాజకీయ వర్గాల్లో మరింత చర్చకు దారితీసింది. బీజేపీ వైస్ చైర్మన్ పదవితో సరిపెట్టుకునే దిశగా అడుగులు వేస్తోందన్న వార్తలు వినిపిస్తున్నాయి.
ప్రజాభిప్రాయాన్ని పక్కనబెట్టి కేవలం అధికారాన్ని అడ్డుకోవడానికే ఈ పొత్తు కుదిరిందని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. మరోవైపు కాంగ్రెస్, బీజేపీ వర్గాలు మాత్రం ఇది స్థానిక పరిస్థితుల దృష్ట్యా తీసుకున్న వ్యూహాత్మక నిర్ణయం అని వివరిస్తున్నాయి. ఆమనగల్ మున్సిపాలిటీలో చైర్మన్ ఎన్నిక ఎలా జరుగుతుందన్న దానిపై ఇప్పుడు రాజకీయ ఆసక్తి నెలకొంది.








