మంటగలిసిన మానవత్వం.. పాడే మోసేందుకూ రాని గ్రామ‌స్తులు

మంటగలిసిన మానవత్వం.. పాడే మోసేందుకూ రాని గ్రామ‌స్తులు

కులం పేరుతో మానవత్వాన్ని తాకట్టు పెట్టిన అమానవీయ ఘటన జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలం కందనకుంట గ్రామంలో చోటుచేసుకుంది. ఓ కుటుంబాన్ని కుల బహిష్కరణ చేయడమే కాకుండా, మరణించిన వ్యక్తి అంత్యక్రియల సమయంలో కూడా కనీస మానవత్వాన్ని ప్రదర్శించకుండా గ్రామ పెద్దలు, సర్పంచ్ వ్యవహరించిన తీరు రాష్ట్రవ్యాప్తంగా ఆగ్రహాన్ని రేపుతోంది.

గ్రామానికి చెందిన ఎదుల రాజేశం కుటుంబాన్ని కొంతకాలంగా కుల బహిష్కరణకు గురిచేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో రాజేశం అనారోగ్యంతో మృతి చెందగా, అతని అంత్యక్రియల్లో పాల్గొనకుండా గ్రామస్తులను కుల పెద్దలు ఆదేశించారు. అంతేకాదు, గ్రామస్తులు మాత్రమే కాదు, దూరపు చుట్టాలు కూడా పాడె మోయకూడదని కాంగ్రెస్ పార్టీకి చెందిన గ్రామ సర్పంచ్ ఆజ్ఞాపించినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

పాడె మోయేందుకు ఎవరో ఒకరు ముందుకు రావాలని రాజేశం కుటుంబసభ్యులు కాళ్లు మొక్కుతూ వేడుకున్నా, సర్పంచ్‌తో పాటు కుల పెద్దలు కనికరం చూపలేదని బాధిత కుటుంబం వాపోతోంది. “చనిపోయినవాడైనా కుల బహిష్కరణే” అన్నట్టుగా వ్యవహరించారని స్థానికులు వ్యాఖ్యానిస్తున్నారు.

ఈ అమానవీయ ఆదేశాల కారణంగా రాజేశం మృతదేహాన్ని ముట్టుకునేందుకు కూడా గ్రామంలో ఒక్కరూ ముందుకు రాలేదు. చివరికి అతని భార్య, అక్కలు, సొంత కుటుంబ సభ్యులే పాడె మోయాల్సిన పరిస్థితి ఏర్పడింది. కన్నీళ్ల మధ్య మహిళలే పాడె మోసి అంత్యక్రియలు నిర్వహించడంతో అక్కడి దృశ్యాలు హృదయ విదారకంగా మారాయి.

21వ శతాబ్దంలోనూ కుల అహంకారం పేరుతో మానవ హక్కులను కాలరాయడం ఏమిటని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. కుల బహిష్కరణ, అంత్యక్రియల్లో పాల్గొననీయకపోవడం చట్టరీత్యా నేరమని న్యాయవాదులు స్పష్టం చేస్తున్నారు. ఈ ఘటనపై తక్షణమే విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని మానవ హక్కుల సంఘాలు, సామాజిక కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment