బైక్‌పై 10 కి.మీ మృతదేహం.. ఏపీలో హృదయవిదారక ఘటన (Video)

బైక్‌పై 10 కి.మీ మృతదేహం.. ఏపీలో హృదయవిదారక ఘటన

ఆంధ్రప్రదేశ్‌లో మరో హృదయవిదారక ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రభుత్వ అంబులెన్సులు పనిచేయకపోవడం, పేదలకు కనీస మౌలిక వసతులు అందని పరిస్థితిని చాటిచెప్పేలా బాపట్ల జిల్లాలో చోటుచేసుకున్న ఈ సంఘటన ప్రజలను కదిలించింది. డబ్బుల్లేక ఆటో అద్దె చెల్లించలేని ఓ కుటుంబం, చ‌నిపోయిన వ్య‌క్తి మృతదేహాన్ని ద్విచక్ర వాహనంపై 10 కిలోమీటర్లు తరలించాల్సిన దయనీయ పరిస్థితి ఏర్పడింది.

ఈ ఘటన బాపట్ల జిల్లా కర్లపాలెం మండలంలో మంగళవారం జరిగింది. కర్లపాలెం మండలం చింతయపాలెం పంచాయతీ రాళ్లచెరువుకు చెందిన నక్క నాగేశ్వరరావుకు ఒక్కసారిగా గుండెనొప్పి రావడంతో, కుటుంబ సభ్యులు, సోదరులు ఆయనను ద్విచక్ర వాహనంపై బాపట్ల ఏరియా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే ఆస్పత్రికి చేరుకునేలోపే నాగేశ్వరరావు మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

అంతవరకూ బాధలో ఉన్న కుటుంబానికి మరో షాక్ తగిలింది. మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించేందుకు ప్ర‌భుత్వ అంబులెన్స్ అందుబాటులో లేదు. ఆటోలో తీసుకెళ్లాలంటే రూ.2,000 నుంచి రూ.3,000 వరకు ఇవ్వాలని డ్రైవర్లు డిమాండ్ చేశారు. అంత మొత్తం చెల్లించే స్థోమత లేకపోవడంతో, చివరకు కుటుంబ సభ్యులు మృతదేహాన్ని ద్విచక్ర వాహనంపైనే తమ గుడిసెలకు తీసుకెళ్లాల్సి వచ్చింది. బాపట్ల జిల్లా కేంద్రానికి సమీపంలోనే ఉన్న రాళ్లచెరువు గ్రామానికి దాదాపు 10 కిలోమీటర్ల దూరాన్ని బైక్‌పై మృతదేహంతో ప్రయాణించడం స్థానికులను కంటతడి పెట్టించింది.

ప్రభుత్వ అంబులెన్సులు అందుబాటులో లేకపోవడం, పేదలకు ఉచితంగా ఉపయోగపడే మహాప్రస్థానం వాహనాల కొరత మరోసారి బహిర్గతమైంది. ఇలాంటి ఘటనలు ఇది మొదటిసారి కాదు. ఇటీవ‌ల అల్లూరి జిల్లాలో జ్వరంతో బాధపడుతున్న తన చిన్న కూతురిని వర్షంలో నాలుగు కిలోమీటర్లు కాలినడకన ఆస్పత్రికి మోసుకెళ్లిన తండ్రి వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అంత‌కు మించిన ఘ‌ట‌న‌ ఇప్పుడు బాపట్ల జిల్లాలో మళ్లీ పునరావృతమైంది.

రోడ్లు సరిగా లేకపోవడం, అత్యవసర వైద్య సేవలు అందుబాటులో లేకపోవడం, అంబులెన్సుల దుస్థితి—ఇవన్నీ కలిపి సామాన్యుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. బాపట్ల ఘటన ప్రభుత్వ వైఫల్యానికి నిలువెత్తు నిదర్శనంగా మారింది. ఇక‌నైనా ఇలాంటి దారుణాలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment