ఆంధ్రప్రదేశ్ పరిపాలనా చరిత్రలో అప్పట్లో తీవ్ర దుమారం రేపిన మాజీ చీఫ్ సెక్రటరీ ఎల్వీ సుబ్రహ్మణ్యం బదిలీ వివాదం మళ్లీ తెరపైకి వచ్చింది. స్వచ్ఛంద పదవీ విరమణ (VRS) తీసుకున్న తర్వాత మాజీ ఐఏఎస్ అధికారి ప్రవీణ్ ప్రకాష్ చేసిన వ్యాఖ్యలు మళ్లీ సంచలనంగా మారాయి. ఇందుకు కారణం తిరుపతి లడ్డూ విషయంపై ఎల్వీ సుబ్రహ్మణ్యం తాజా ఇంటర్వ్యూ అని చర్చ జరుగుతోంది.
ఎల్వీ సుబ్రహ్మణ్యం వైసీపీ ప్రభుత్వంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. అప్పట్లో సీఎస్‌గా ఉన్న ఎల్వీ పరిపాలన విభాగానికి సంబంధించి కొన్ని కీలక ఫైళ్లపై సంతకాలు చేయకుండా కాలయాపన చేశారని, వైఎస్ జగన్ ప్రభుత్వ నిర్ణయాలకు అడ్డుపడిన పరిస్థితి ఏర్పడిందని మాజీ ఐఏఎస్ అధికారి ప్రవీణ్ ప్రకాష్ వెల్లడించారు.
వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత తన ప్రభుత్వ ప్రాధాన్యత పథకాలు (నవరత్నాలు) మరియు ఇతర నిర్ణయాలను వేగంగా అమలు చేయాలని భావించారని, ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసే క్రమంలో ఎల్వీ సుబ్రహ్మణ్యం కీలకమైన ఫైళ్లపై సంతకాలు చేయకుండా ఆలస్యం చేస్తున్నారని, దీనివల్ల ప్రభుత్వ లక్ష్యాలు దెబ్బతింటున్నాయని జగన్ భావించినట్లు ప్రవీణ్ ప్రకాష్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.
ఒకానొక దశలో ఎల్వీ సుబ్రహ్మణ్యం రాష్ట్ర ప్రభుత్వం కంటే తన వ్యక్తిగత నిర్ణయాలకే ప్రాధాన్యత ఇస్తున్నారని జగన్ భావించారని ప్రవీణ్ ప్రకాష్ తన వ్యాఖ్యల ద్వారా స్పష్టం చేశారు. ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాలకు సహకరించని అధికారి సీఎస్‌గా ఉండటం సరికాదని జగన్ భావించి, ఆయనను హఠాత్తుగా బదిలీ చేయాలని నిర్ణయించుకున్నారని ఆయన వివరించారు.
“ముఖ్యమంత్రే సర్వాధికారి”
పాలనపై ప్రవీణ్ ప్రకాష్ కీలక వ్యాఖ్యలు చేశారు. పాలన వ్యవస్థలో ముఖ్యమంత్రే అత్యున్నత అధికారమని ప్రవీణ్ ప్రకాష్ స్పష్టం చేశారు. “ముఖ్యమంత్రి ఒక పని చేయమని చెబితే… అది చేయాల్సిందే. ఆయన నిర్ణయాలను అమలు చేయడమే అధికారుల బాధ్యత” అని వ్యాఖ్యానించారు. ప్రభుత్వం నిర్ణయించిన విజన్‌కు అనుగుణంగా అధికారులు పని చేయాల్సిందేనని, ఆ దిశగా సహకరించని పరిస్థితుల్లో చర్యలు తప్పవన్న సంకేతాన్ని కూడా ఆయన ఇచ్చారు.
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై గతంలో ఉన్న కోపాన్ని వ్యక్తిగత వైరంగా మార్చుకొని ఇప్పుడు కొత్తగా టీడీపీ అనుకూల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో లడ్డూ కల్తీ జరిగిందంటూ మాట్లాడుతున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఆరోపించినట్లుగా లడ్డూలో జంతుకొవ్వు లేదని సుప్రీం కోర్టు పరిధిలోని సీబీఐ సిట్ చార్జ్‌షీట్‌లో ప్రస్పుటంగా పేర్కొందని, అలాంటి వ్యాఖ్యలు చేసిన కూటమి పెద్దలను నిలదీస్తే బాగుంటుందని సూచిస్తున్నారు. వ్యక్తిగత కోపంతో పరోక్షంగా జగన్‌పై ఆరోపణలు చేయడానికి పెట్టే శ్రద్ధ కాస్త అటు కూడా తిప్పితే మంచిదని సలహా ఇస్తున్నారు.








