గ్రూప్‌–1 ర్యాంకులపై తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు

తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు… గ్రూప్‌–1 ర్యాంకులు సక్రమం

తెలంగాణ ప్రభుత్వం, టీజీపీఎస్సీకి గ్రూప్‌–1 మెయిన్స్‌ పరీక్ష విషయంలో భారీ ఊరట లభించింది. ఈ అంశంపై తెలంగాణ హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ సంచలన తీర్పు వెలువరించింది. ర్యాంకులను రద్దు చేస్తూ గతంలో సింగిల్‌ జడ్జి బెంచ్‌ ఇచ్చిన తీర్పును చీఫ్‌ జస్టిస్‌ అపరేశ్‌కుమార్‌ సింగ్‌ నేతృత్వంలోని ధర్మాసనం కొట్టివేసింది. గ్రూప్‌–1 పరీక్ష పారదర్శకంగా జరిగిందని, మూల్యాంకనంలో ఎలాంటి అవకతవకలకు ఆధారాలు లేవని కోర్టు స్పష్టం చేసింది. దీంతో గ్రూప్‌–1 నియామకాలు సక్రమమేనని తేల్చి చెప్పింది.

ఈ తీర్పుతో ఇప్పటికే నియామక ఉత్తర్వులు పొందిన 563 మంది అభ్యర్థులకు భారీ ఊరట లభించింది. 2024 అక్టోబర్‌ 21 నుంచి 27 వరకు టీజీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్‌–1 మెయిన్స్‌ పరీక్షపై అవకతవకలు జరిగాయంటూ పలువురు అభ్యర్థులు పిటిషన్లు దాఖలు చేయగా, వాటిపై విచారణ చేపట్టిన సింగిల్‌ జడ్జి మార్చిలో ఫలితాలు, ర్యాంకింగ్‌ జాబితాను రద్దు చేసి మళ్లీ మూల్యాంకనం లేదా పరీక్ష నిర్వహించాలని ఆదేశించారు. అయితే ఈ ఆదేశాలను సవాల్‌ చేస్తూ టీజీపీఎస్సీతో పాటు ఎంపికైన అభ్యర్థులు డివిజన్‌ బెంచ్‌ను ఆశ్రయించగా, తాజాగా వారికి అనుకూలంగా తీర్పు వెలువడింది.

విచారణ సందర్భంగా టీజీపీఎస్సీ తరఫున అడ్వొకేట్‌ జనరల్‌ ఎ.సుదర్శన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ పరీక్షలు నిబంధనల ప్రకారం పూర్తిగా పారదర్శకంగా నిర్వహించామని, మూల్యాంకనంలో ద్వంద్వ పద్ధతిని అమలు చేశామని వివరించారు. మరోవైపు ఎంపికైన అభ్యర్థుల తరఫున సీనియర్‌ న్యాయవాది డి.ప్రకాశ్‌రెడ్డి వాదిస్తూ ఫలితాలు వచ్చిన తర్వాతే అభ్యంతరాలు తెలపడం చెల్లదన్నారు. అన్ని వాదనలు పరిగణనలోకి తీసుకున్న డివిజన్‌ బెంచ్‌, గ్రూప్‌–1 నియామకాల్లో ఎలాంటి లోపాలు లేవని తేల్చి చెప్పడంతో ఈ వ్యవహారం కీలక మలుపు తిరిగింది.

Join WhatsApp

Join Now

Leave a Comment