సినీ ప్రముఖులతో డిప్యూటీ సీఎం భట్టి భేటీ

సినీ ప్రముఖులతో డిప్యూటీ సీఎం భట్టి భేటీ

తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే ప్రముఖ ఫిలిం ఇండస్ట్రీ హబ్‌గా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం కృతనిశ్చయంతో పనిచేస్తోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో సినీ ప్రముఖులు, గద్దర్ సినిమా అవార్డు జ్యూరీ సభ్యులతో నిర్వహించిన సమావేశంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.

ఫిలిం ఇండస్ట్రీకి కేంద్రంగా హైదరాబాద్‌ను అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని, దేశవ్యాప్తంగా అన్ని భాషల సినీ పరిశ్రమలు ఇక్కడికి వచ్చేలా అనుకూల వాతావరణాన్ని సృష్టిస్తున్నామని తెలిపారు. భవిష్యత్‌లో అంతర్జాతీయ సినీ మార్కెట్‌కు కూడా హైదరాబాద్ కేంద్రంగా మారేలా చర్యలు తీసుకుంటున్నామని భట్టి విక్రమార్క అన్నారు.

సినీ రంగంపై ప్రభుత్వం ప్రత్యేక బ్లూ ప్రింట్‌ను రూపొందిస్తోందని, ఫిలిం ఇండస్ట్రీ అభివృద్ధి ద్వారా రాష్ట్ర యువతకు భారీగా ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఉద్దేశం ఉందని తెలిపారు. ఈ క్రమంలోనే సినీ రంగానికి గౌరవం పెంచేలా గద్దర్ సినిమా అవార్డులను తిరిగి ప్రారంభించామని చెప్పారు.

సమాజం కోసం తన జీవితాన్ని కళల ద్వారా త్యాగం చేసిన మహానుభావుడు గద్దర్ అని గుర్తు చేశారు. ఆయన పేరుతో అవార్డులు అందించడం ద్వారా సినీ రంగానికి మరింత ప్రోత్సాహం లభిస్తుందని తెలిపారు. గద్దర్ అవార్డుల ఎంపికలో ప్రతిభ, పారదర్శకత మాత్రమే ప్రమాణంగా ఉంటాయని స్పష్టం చేశారు. కమర్షియల్ విజయం సాధించిన సినిమాలతో పాటు సామాజిక సందేశం ఉన్న చిత్రాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు వెల్లడించారు.

ఈ నెల 6వ తేదీ నుంచి గద్దర్ సినిమా అవార్డుల స్క్రీనింగ్ ప్రక్రియ ప్రారంభం కానుందని, ఉగాది రోజైన 19వ తేదీన అవార్డుల ప్రదానోత్సవాన్ని నిర్వహించనున్నట్లు డిప్యూటీ సీఎం తెలిపారు. ఈ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోందన్నారు.

గద్దర్ అవార్డుల నిర్వహణలో ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ (FDC), సమాచార & ప్రజాసంబంధాల శాఖ (I&PR)లకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చామని భట్టి విక్రమార్క వెల్లడించారు. సినీ పరిశ్రమ అభివృద్ధితో పాటు కళలకు, కళాకారులకు గౌరవం పెరిగేలా ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని ఆయన భరోసా ఇచ్చారు.

Join WhatsApp

Join Now

Leave a Comment