విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో ట్రస్ట్ బోర్డు సభ్యురాలి భర్త వీరంగం సృష్టించాడు. ఆలయ ఉద్యోగులపై బూతులు తిడుతూ ట్రస్ట్ బోర్డు మెంబర్ తరిగొప్పల పార్వతి భర్త హుస్సేన్ రెచ్చిపోయిన ఘటన వెలుగులోకి వచ్చింది.
మూడురోజుల క్రితం ట్రస్ట్ బోర్డు మెంబర్ తరిగొప్పల పార్వతి, ఆమె భర్త హుస్సేన్ నలుగురు మహిళలతో కలిసి దర్శనానికి వచ్చారు. ఈ సందర్భంగా వేద పండితులు ఇద్దరికి జాకెట్ ముక్కలు, మరో ఇద్దరికి ప్రసాదం ఇచ్చి ఆశీర్వచనం చేశారు. అయితే తమతో వచ్చిన ప్రతి ఒక్కరికీ శేషవస్త్రాలు, జాకెట్ ముక్కలు, ప్రసాదం ఇవ్వలేదని ఆలయ సిబ్బందిపై హుస్సేన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
తమకు అనుకూలంగా వ్యవహరించలేదన్న కారణంతో ఆలయ ఉద్యోగులను బూతులు తిడుతూ, దురుసుగా ప్రవర్తించాడు. ఉద్యోగులపై బూతులు తిడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మరింత ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే, ఉద్యోగులపై భర్త రెచ్చిపోతున్నా ట్రస్ట్ బోర్డు మెంబర్ పార్వతి ఆయనను వారించే ప్రయత్నం కూడా చేయలేదు. ట్రస్ట్ బోర్డు మెంబర్ భర్త కావడంతో ఆలయ అధికారులు మౌనంగా ఉండిపోయారని, ఉద్యోగులు తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యారని ఆలయ వర్గాలు చెబుతున్నాయి.
దుర్గగుడిలో వరుసగా జరుగుతున్న పరిణామాలు భక్తుల్లో తీవ్ర ఆందోళనను రేపుతున్నాయి. ఇటీవల ఆలయానికి కరెంట్ సరఫరా నిలిచిపోవడం, లడ్డూ ప్రసాద కౌంటర్ వద్ద భక్తులకు కరెంట్ షాక్ తగిలిన ఘటనలు ఇప్పటికే కలకలం సృష్టించాయి. ఇప్పుడు ట్రస్ట్ బోర్డు సభ్యుల కుటుంబ సభ్యుల ప్రవర్తన కూడా వివాదాస్పదంగా మారడంతో దుర్గగుడి నిర్వహణపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పుణ్యక్షేత్రాల్లో హోదా, అధికారాన్ని చూపిస్తూ ఇష్టానుసారంగా ప్రవర్తించడం ఎంతవరకు సమంజసమన్న చర్చ మొదలైంది.









పవన్.. ఓ దిష్టి కల్యాణ్.. టీపీసీసీ చీఫ్ సంచలన వ్యాఖ్యలు