టీ20 వరల్డ్‌కప్‌లో భాగంగా ఈనెల 15వ తేదీన భారత్‌తో జరగనున్న మ్యాచ్‌ను బహిష్కరిస్తున్నట్లు పాకిస్థాన్ ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) తీవ్రంగా స్పందించింది. భారత్‌తో మ్యాచ్‌ను బాయ్‌కాట్ చేయడం వల్ల పాకిస్థాన్ క్రికెట్ శిక్షార్హమైన పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని ఐసీసీ స్పష్టంగా హెచ్చరించింది.
ఫిబ్రవరి 7 నుంచి ప్రారంభం కానున్న టీ20 వరల్డ్‌కప్‌లో పాల్గొనేందుకు అనుమతి ఉన్నప్పటికీ, ఫిబ్రవరి 15న భారత్‌తో జరిగే కీలక మ్యాచ్‌ను బహిష్కరించాలని పాకిస్థాన్ ప్రభుత్వం సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది. ఈ నిర్ణయం క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేయగా, ఐసీసీ వెంటనే స్పందించింది.
పాకిస్థాన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై పాక్ క్రికెట్ బోర్డు (PCB) పునరాలోచన చేస్తుందని ఆశిస్తున్నట్లు ఐసీసీ పేర్కొంది. భారత్‌తో మ్యాచ్ బహిష్కరణ వల్ల కేవలం పాకిస్థాన్ క్రికెట్‌కే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ వ్యవస్థపై కూడా తీవ్ర ప్రభావం పడుతుందని ఐసీసీ వెల్లడించింది.
ఐసీసీ ద్వారా ఆర్థికంగా, అంతర్జాతీయంగా లాభాలు పొందుతున్న పాకిస్థాన్ ఈ నిర్ణయం వల్ల కఠినమైన పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించింది. ప్రభుత్వాలు జాతీయ విధానాల ప్రకారం తీసుకునే నిర్ణయాలను గౌరవిస్తామని, కానీ క్రీడాస్పూర్తికి విరుద్ధమైన చర్యలను ప్రోత్సహించలేమని ఐసీసీ స్పష్టం చేసింది.
ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది క్రికెట్ అభిమానులను నిరాశపరచలేమని ఐసీసీ తెలిపింది. పాకిస్థాన్‌లో కూడా లక్షలాది మంది క్రికెట్ అభిమానులు ఉన్నారని, వారి భావోద్వేగాలను కూడా పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొంది.
ఈ నిర్ణయం ఆటగాళ్లది కాదని పాకిస్థాన్ కెప్టెన్ సల్మాన్ అలీ ఆఘా స్పష్టం చేశారు. ఇది పూర్తిగా పాకిస్థాన్ క్రికెట్ బోర్డు తీసుకున్న నిర్ణయమని, బోర్డు ఆదేశాలకు ఆటగాళ్లు కట్టుబడి ఉంటామని ఆయన తెలిపారు. మ్యాచ్ జరుగుతుందా లేదా అన్నది ఇంకా స్పష్టత లేదని అన్నారు.
ఇదిలా ఉండగా, ఐసీసీ షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 15న శ్రీలంకలో భారత జట్టు అందుబాటులో ఉంటుందని బీసీసీఐ స్పష్టం చేసింది. షెడ్యూల్ ప్రకారమే భారత జట్టు వేదికకు చేరుకుంటుందని, ప్రెస్ కాన్ఫరెన్స్‌లో పాల్గొంటుందని, నిర్ణయించిన సమయానికి స్టేడియానికి చేరుకుంటుందని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. మ్యాచ్ రిఫరీ అధికారికంగా మ్యాచ్ రద్దు చేసినట్లు ప్రకటించే వరకూ భారత జట్టు అక్కడే ఉంటుందని వెల్లడించాయి.








