లోకేష్ పర్యటన.. యనమల దివ్యకు అవమానం! (Video)

Nara Lokesh, TDP, Telugu Desam Party , Kakinada Politics, Andhra Pradesh Politics, TDP Internal Issues, Yanmala Divya, Kakinada JNTU, TDP Cadre Protest, Political Controversy , Lokesh Tour, TDP Leaders, Andhra Politics,

మంత్రి నారా లోకేష్ రాష్ట్రంలో ఎక్కడికైనా భయంభయంగా పర్యటిస్తున్నారనే వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో సంచ‌ల‌నంగా మారాయి. సొంత పార్టీ నేతలు, కార్యకర్తల నుంచే పెరుగుతున్న అసంతృప్తి నేపథ్యంలో, లోకేష్ పర్యటనలు పూర్తిగా పోలీసుల నీడలో, మీడియాకు దూరంగా సాగుతున్నాయన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా కాకినాడ జిల్లాలో జరిగిన లోకేష్ పర్యటన కూడా ఇదే తరహాలో సాగడం చర్చనీయాంశంగా మారింది.

కాకినాడ జిల్లాలో లోకేష్ పర్యటన మొత్తం గప్‌చుప్‌గా సాగింది. సొంత పార్టీ ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులను కూడా లోకేష్ దరిదాపుల్లోకి రానివ్వలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. పార్టీ నాయకులు, కార్యకర్తలు తమ సమస్యలు చెప్పుకునేందుకు ప్రయత్నించినా చిన‌బాబు ముఖం చాటేశారని వాపోతున్నారు. కష్టపడి పనిచేసిన క్యాడర్‌కే సమయం కేటాయించకపోతే ఎలా అని టీడీపీ శ్రేణులు అసహనం వ్యక్తం చేస్తున్నాయి.

యనమల దివ్యకు ఘోర అవమానం
లోకేష్ పర్యటన సందర్భంగా తుని ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ యనమల దివ్యకు జరిగిన అవమానం తీవ్ర చర్చకు దారితీసింది. కాకినాడ రూరల్ జేఎన్టీయూలో జరిగిన కార్యక్రమంలో లోకేష్‌ను కలుసుకునేందుకు వెళ్లిన యనమల దివ్యను పోలీసులు మెయిన్ గేట్ వద్దే అడ్డుకున్నారు. లోపలికి అనుమతించకపోవడంతో ఆమె గేటు బయట కారులోనే చాలా సేపు నిరీక్షించాల్సి వచ్చింది. చివరకు మరో గేటు ద్వారా ఆమెను లోపలికి అనుమతించడం పార్టీ వర్గాల్లో తీవ్ర అసంతృప్తికి కారణమైంది.

మాజీ మంత్రి, అధికారులకూ అదే పరిస్థితి
యనమల దివ్యతో పాటు మాజీ మంత్రి చిక్కాల రామచంద్రరావుకూ ఇదే అనుభవం ఎదురైంది. లోకేష్‌ను కలవాలని ప్రయత్నించినా పోలీసులు అనుమతించకపోవడంతో ఆయన జేఎన్టీయూ మెయిన్ గేట్ నుంచే వెనుదిరగాల్సి వచ్చింది. అలాగే పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు లోకేష్‌ను కలిసి తమ సమస్యలు చెప్పుకునేందుకు ప్రయత్నించినా నిరాశే ఎదురైంది. ఇదే సమయంలో కోరమండల్ ఆసుపత్రి ప్రారంభోత్సవం సందర్భంగా కాకినాడ ఆర్డీవో మల్లిబాబును కూడా పోలీసులు లోపలికి అనుమతించకపోవడం అధికార వర్గాల్లోనూ చర్చకు దారితీసింది. మొత్తం మీద లోకేష్ పర్యటన మీడియాకు దూరంగా, పోలీసుల భద్రత మధ్య సాగినట్టుగా కనిపించింది.

నిరసనకు దిగిన టీడీపీ తమ్ముళ్లు
కాకినాడ రూరల్ నియోజకవర్గ ఇన్‌చార్జి పదవి కోసం ఆశగా ఎదురు చూస్తున్న టీడీపీ నేతలకు లోకేష్ పర్యటన తీవ్ర నిరాశ మిగిల్చింది. నేతలతో సమన్వయ సమావేశం అంటూ చెప్పి ఎటువంటి స్పష్టత ఇవ్వకుండా లోకేష్ వెళ్లిపోవడంపై ఆశావహులు భగ్గుమన్నారు. ఒక టీమ్‌ను పంపిస్తామని చెప్పి వెళ్లిపోవడం పార్టీ నేతల్లో ఆగ్రహాన్ని పెంచింది. పాస్‌లు ఇచ్చినా కొందరిని లోపలికి అనుమతించలేదని కార్యకర్తలు మండిపడ్డారు. ప్రాంగణం బయట టీడీపీ కార్యకర్తలు నిరసనకు దిగారు. నినాదాలు చేస్తూ హంగామా చేయడం పరిస్థితి ఉద్రిక్తతకు దారితీసింది. కాకినాడ పర్యటనలో లోకేష్ హడావుడి తప్ప, పార్టీ శ్రేణులకు భరోసా ఇవ్వలేకపోయారనే అభిప్రాయం బలపడుతోంది.

Join WhatsApp

Join Now

Leave a Comment