‘ఎన్నికలంటే భయం లేదు.. కానీ, నేను బీఆర్ఎస్‌లోనే ఉన్నా..’

‘ఎన్నికలంటే భయం లేదు.. కానీ, నేను బీఆర్ఎస్‌లోనే ఉన్నా..’

ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ వ్య‌వ‌హార శైలి వివాదాస్ప‌దంగా మారుతోంది. అనర్హత వ్యవహారంలో స్పీకర్ నుంచి జారీ అయిన నోటీసులు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి. స్పీకర్ నోటీసులకు సంబంధించి తమ అడ్వకేట్ ద్వారా వివరణ ఇచ్చామని, అయితే ఆ లేఖకు ఇప్పటివరకు ఎలాంటి సమాధానం రాలేదని తెలిపారు.

విచారణకు వ్యక్తిగతంగా హాజరు కావాలని తనకు ఎక్కడా చెప్పలేదని, త‌మ అడ్వకేట్ స్పీకర్‌కు పంపిన లేఖలో ఏమి రాశారన్న విషయం తనకు తెలియదన్నారు. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ తనను ఇప్పటివరకు సస్పెండ్ చేయలేదని, పార్టీ తీసుకునే నిర్ణయాన్ని బట్టి తాను స్పందిస్తానని చెప్పారు. ఎన్నికలంటే తనకు ఎలాంటి భయమూ లేదని, ప్రజలే తన బలం అని వ్యాఖ్యానించారు.

తాను బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసినట్టు జరుగుతున్న ప్రచారాన్ని దానం నాగేందర్ ఖండించారు. పార్టీ మారినట్టు చెబుతున్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని పేర్కొన్నారు. తన అనర్హతపై దాఖలైన పిటిషన్‌పై స్పీకర్ ముందు అఫిడవిట్ సమర్పించినట్లు తెలిపారు. ఈ పిటిషన్‌ను కొట్టివేయాలని స్పీకర్‌ను కోరినట్లు వెల్లడించారు.

అయితే, ఎంపీగా కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి, అనంతరం తాను బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నానని దానం నాగేందర్ ప్రకటించుకోవడంపై రాజకీయ వర్గాల్లో తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. పార్టీ మార్పులపై స్పష్టత లేకపోవడం, భిన్న ప్రకటనలు చేయడం రాజకీయ విలువలు దిగజారుతున్నాయనే విమర్శలకు దారితీస్తున్నాయి. ఈ నేపథ్యంలో స్పీకర్ అనర్హత పిటిషన్‌పై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. దానం నాగేందర్ భవిష్యత్ రాజకీయ ప్రయాణంపై ఈ నిర్ణయం కీలకంగా మారనుంది.

Join WhatsApp

Join Now

Leave a Comment