చిరంజీవి (Chiranjeevi) ఇటీవల ‘మన శంకర వరప్రసాద్’ (Mana Shankara Varaprasad) సినిమా సక్సెస్ మీట్‌లో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సినీ వర్గాల్లో తీవ్ర చర్చకు కారణమయ్యాయి. సినిమా పరిశ్రమ అద్దంలాంటిదని, ఇక్కడ కాస్టింగ్ కౌచ్ (Casting Couch) లేదని ఆయన చేసిన వ్యాఖ్యలపై ప్రముఖ గాయని చిన్మయి శ్రీపాద (Chinmayi Sripaada) తీవ్రంగా స్పందించారు. చిరంజీవి పట్ల గౌరవం వ్యక్తం చేస్తూనే, ఇండస్ట్రీలో మహిళలు ఎదుర్కొంటున్న అసలు వాస్తవాలను ఆమె సోషల్ మీడియా వేదికగా బయటపెట్టారు.
కమిట్‌మెంట్ అర్థం ఇదేనా?
చిన్మయి తన పోస్ట్‌లో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇండస్ట్రీలో వినిపించే ‘కమిట్‌మెంట్’ (Commitment) అనే పదానికి వృత్తిపరమైన నిబద్ధత అనే అర్థం కాదని, అది మహిళల శరీరాలపై పెట్టే ఒత్తిడికి సంకేతంగా మారిందని పేర్కొన్నారు. అవకాశాలు రావాలంటే మహిళలు తమ శరీరాన్ని అర్పించాల్సిందే అన్న భావన చాలా చోట్ల సహజంగా మారిపోయిందని ఆమె తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చిరంజీవి తరం వేరు అని, అప్పట్లో నటీనటుల మధ్య గౌరవభావం ఉండేదని అంగీకరించిన చిన్మయి, కానీ నేటి పరిస్థితులు మాత్రం పూర్తిగా భిన్నంగా, దారుణంగా ఉన్నాయని అన్నారు.
ఇండస్ట్రీలో చీకటి నిజాలు
ఇండస్ట్రీలో జరుగుతున్న లైంగిక వేధింపులపై (Sexual Harassment) చిన్మయి కొన్ని షాకింగ్ ఉదాహరణలను వెల్లడించారు. ఒక ప్రముఖ వ్యక్తి స్టూడియోలో ఒక మహిళా మ్యూజిషియన్‌పై లైంగిక దాడికి ప్రయత్నించగా, ఆమె ప్రాణభయంతో సౌండ్ బూత్‌లో తలుపు వేసుకుని కూర్చోవాల్సి వచ్చిందని చెప్పారు. మరో సీనియర్ వ్యక్తి వచ్చి కాపాడే వరకు ఆమె అక్కడే ఉండిపోయిందని, ఆ ఘటన తర్వాత ఆ మహిళ పూర్తిగా ఈ రంగాన్ని వదిలేసిందని తెలిపారు. అలాగే, ఒక పేరున్న గాయకుడు మహిళలకు అనవసరంగా తన వ్యక్తిగత ఫోటోలు పంపుతూ, లైంగిక కోరికలు తీర్చాలంటూ వేధించేవాడని, ఇలాంటి వ్యక్తులకు సమాజం మళ్లీ గౌరవం, అవకాశాలు ఇస్తుందని చిన్మయి ఆవేదన వ్యక్తం చేశారు.
అమ్మ పక్కనే ఉన్నా మారని మగబుద్ధి
తన వ్యక్తిగత అనుభవాన్ని కూడా చిన్మయి ఈ సందర్భంగా పంచుకున్నారు. ప్రముఖ లిరిసిస్ట్ (Renowned lyricist) వైరాముత్తు (Vairamuthu) తనను లైంగికంగా వేధించిన సమయంలో తన తల్లి అక్కడే ఉన్నారని, అయినా కూడా మగవారి ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాలేదని చెప్పారు. ఇది మహిళలు ఎంత అసురక్షితంగా ఉంటారనే దానికి నిదర్శనమని ఆమె వ్యాఖ్యానించారు. అలాగే, సీనియర్ నటి షావుకారు జానకి వంటి వారు మీటూ ఉద్యమాన్ని అర్థం చేసుకోకుండా బాధితులనే తప్పుబట్టడం మరింత బాధాకరమని అన్నారు.
ఇండస్ట్రీ అద్దం కాదు
చిరంజీవి వ్యాఖ్యలను పరోక్షంగా ఖండిస్తూ, సినిమా పరిశ్రమ అద్దంలాంటిది కాదని చిన్మయి స్పష్టం చేశారు. పని ఇవ్వాలంటే సెక్స్ కోరుకోవడం సాధారణంగా మారిపోయిన పురుషుల ఆలోచనా ధోరణే అసలు సమస్య అని ఆమె తేల్చి చెప్పారు. తన సుదీర్ఘ పోస్ట్‌ను మహిళల గొంతుకగా, నిజాలను బయట పెట్టే ప్రయత్నంగా ఆమె ముగించారు.








