కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government)పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత పెరుగుతోందని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం (Professor Kodandaram) ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షాలను గౌరవించకుండా ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటోందని ఆయన మండిపడ్డారు.
ముఖ్యంగా సింగరేణి సంస్థ (Singareni Collieries Company Limited – SCCL)ను కార్పొరేట్ వ్యవస్థలకు కట్టబెట్టే ప్రయత్నాలు చేయడం ప్రజాస్వామ్య విరుద్ధమని విమర్శించారు. నామినేటెడ్ పోస్టుల్లో కూడా తమ పార్టీకి తగిన ప్రాధాన్యం ఇవ్వలేదని, మిత్రపక్షంగా ఉన్నప్పటికీ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందని చెప్పారు.
లోకల్ బాడీ ఎన్నికలు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో సీట్ల కేటాయింపుపై ఎలాంటి చర్చ జరపకపోవడం దురదృష్టకరమని కోదండరాం అన్నారు. ఇచ్చిన ఎమ్మెల్సీ పదవీ కూడా కోర్టు పరిధిలో ఉండటంతో తమకు పూర్తిస్థాయి న్యాయం జరగలేదని పేర్కొన్నారు. ఇలాగే కాంగ్రెస్ వ్యవహారం కొనసాగితే మిత్రపక్షం నుంచి బయటకు వచ్చి, ప్రజా సమస్యలపై కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తామని ఆయన స్పష్టమైన హెచ్చరిక చేశారు.








