చిత్తూరు సమాచార శాఖ (Information & Public Relations – I&PR) అధికారిక వాట్సాప్ గ్రూపు (Official WhatsApp Group)లో ఒక్కసారిగా కలకలం రేగింది. సాధారణంగా ప్రభుత్వ సమాచారంతో నడిచే ఆ గ్రూపులో అనుచిత న్యూడ్ వీడియోలు (Nude Videos) ప్రత్యక్షమవడంతో అధికారులు, మీడియా ప్రతినిధులు విస్తుపోయారు. ఈ వీడియోలు I&PR డిప్యూటీ డైరెక్టర్ ఫోన్ నంబర్ నుంచే గ్రూపులోకి రావడం మరింత సంచలనంగా మారింది.
ఫోన్ హ్యాక్‌నే కారణమా? సైబర్ క్రైమ్ పోలీసుల విచారణ
ఈ ఘటనపై స్పందించిన డిప్యూటీ డైరెక్టర్ తన ఫోన్ హ్యాక్ అయిందని అనుమానిస్తూ ఇప్పటికే సైబర్ క్రైమ్ పోలీసులకు (Cyber Crime Police) ఫిర్యాదు చేసినట్లు సమాచారం. తనకు తెలియకుండానే ఫోన్ నుంచి వీడియోలు పోస్ట్ అయ్యాయని ఆయన స్పష్టం చేశారు. ఈ వ్యవహారంపై సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిజంగా హ్యాకింగ్ జరిగిందా? లేక ఇతర కోణాలున్నాయా? అన్న అంశాలపై విచారణ కొనసాగుతోంది.
పెరుగుతున్న సైబర్ నేరాలు.. అప్రమత్తంగా ఉండాలంటున్న పోలీసులు
ఇటీవల కాలంలో సైబర్ నేరగాళ్లు మరింత రెచ్చిపోతున్నారు. ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్లను హ్యాక్ చేయడం, వాట్సాప్ గ్రూపులు, ఇన్‌స్టాగ్రామ్ పేజీలను టార్గెట్ చేయడం వంటి ఘటనలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. కొద్ది రోజుల క్రితం కొన్ని అధికారిక వెబ్‌సైట్లలో బెట్టింగ్‌కు సంబంధించిన కంటెంట్ దర్శనమివ్వడం తీవ్ర చర్చకు దారితీసింది.
ఇదే కాకుండా, దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఘటనలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) అధికారిక వెబ్‌సైట్‌లో పైరసీ సినిమాల వెబ్‌సైట్ ‘ఐబొమ్మ’ లింక్ కనిపించడం సైబర్ భద్రతపై ఆందోళనలు పెంచింది. ఈ నేపధ్యంలో సోషల్ మీడియా ఖాతాలు లేదా అధికారిక డిజిటల్ ప్లాట్‌ఫార్మ్‌లు హ్యాక్ అయిన వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని సైబర్ అధికారులు ప్రజలకు సూచిస్తున్నారు.








