ఆంధ్రజ్యోతి తప్పుడు కథనాలతో టీటీడీకి రాజీనామా చేస్తున్నా – జంగా

ఆంధ్రజ్యోతి కథనాలతో టీటీడీకి రాజీనామా చేస్తున్నా - జంగా

తిరుమల తిరుపతి దేవస్థానాల (టీటీడీ) (TTD) బోర్డు సభ్యత్వానికి జంగా కృష్ణమూర్తి (Janga Krishnamurthy) రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన తన రాజీనామా లేఖను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu)కు పంపించారు. తనపై గత రెండు రోజులుగా ఆంధ్రజ్యోతి పత్రిక(Andhra Jyothy Newspaper)లో వచ్చిన తప్పుడు కథనాల వల్ల తీవ్ర మనస్తాపానికి గురయ్యానని జంగా కృష్ణమూర్తి లేఖలో పేర్కొన్నడం సంచ‌ల‌నంగా మారింది.

తనను కనీసం సంప్రదించకుండా, వాస్తవాలు తెలుసుకోకుండా వార్తలు ప్రచురించడం బాధాకరమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తన వ్యక్తిగత ప్రతిష్ఠను దెబ్బతీసేలా కథనాలు రాయడం శోచనీయమని వ్యాఖ్యానించారు. తాను టీటీడీ బోర్డు సభ్యుడి (TTD Board Member)గా ఉన్న హోదాను అడ్డుపెట్టుకుని పవిత్ర స్థలమైన శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో అపవిత్ర చర్యలకు పాల్పడ్డానన్న రీతిలో కథనాలు రావడం తనను తీవ్రంగా కలచివేసిందన్నారు.

లేఖలో జంగా కృష్ణమూర్తి కీలక విషయాలను వెల్లడించారు. గతంలో తనకు కేటాయించిన బాలాజీ నగర్ ఫ్లాట్ నెంబర్–2 ఇప్పటివరకు ఖాళీగానే ఉందని, దానిని రీ–అలాట్ చేయాలని ముఖ్యమంత్రిని మాత్రమే కోరినట్టు స్పష్టం చేశారు. ఈ అంశాన్ని సీఎం చంద్రబాబు టీటీడీ బోర్డు నిర్ణయానికి పంపించారని, అనంతరం బోర్డు తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపినట్టు తెలిపారు. అయితే ఈ వాస్తవాలను పక్కనపెట్టి తనపై వ్యక్తిగత హననానికి పాల్పడటం ధర్మసమ్మతమా? అని ప్రశ్నించారు.

అలాగే నిన్న జరిగిన మంత్రివర్గ సమావేశంలో వాస్తవాలు తెలుసుకోకుండా టీటీడీ బోర్డు తీసుకున్న నిర్ణయాన్ని రద్దు చేస్తామని నిర్ణయించడం తనను మరింత బాధించిందన్నారు. పూర్తిస్థాయి విచారణ లేకుండా ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు.

చివరగా, కలియుగ భగవానుడు శ్రీ వెంకటేశ్వర స్వామికి సేవ చేసే భాగ్యాన్ని తనకు కల్పించినందుకు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. స్వామివారి సేవ చేసే అవకాశాన్ని కోల్పోతున్నందుకు ఆ భగవంతుని క్షమించమని ప్రార్థిస్తూ, తన రాజీనామాను ఆమోదించాలని సీఎం ను కోరారు. జంగా కృష్ణమూర్తి రాజీనామాతో టీటీడీ బోర్డు వ్యవహారం, మీడియా కథనాల పాత్రపై రాజకీయ, సామాజిక వర్గాల్లో చర్చ మొదలైంది.

Join WhatsApp

Join Now

Leave a Comment