రాయ‌’చోటు’ మార్పు.. మంత్రి భావోద్వేగం.. చంద్ర‌బాబు ఓదార్పు

రాయ‌'చోటు' మార్పు.. మంత్రి భావోద్వేగం.. చంద్ర‌బాబు ఓదార్పు

వైకుంఠ ఏకాదశి వేళ అన్నమయ్య జిల్లా (Annamayya District) ప్ర‌జ‌ల‌కు చేదు వార్త ఎదురైంది. రాయ‌చోటి (Rayachoti) జిల్లా కేంద్రంగా ఉన్న అన్నమ్మయ్య జిల్లా మూడు ముక్కలు అయ్యింది. రాయచోటి జిల్లా కేంద్రం ఎత్తివేస్తూ మ‌ద‌న‌ప‌ల్లె కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇప్ప‌టి వ‌ర‌కు అన్న‌మ‌య్య జిల్లాలో ఉన్న రాజంపేట‌ను క‌డ‌ప జిల్లాలో, రైల్వేకోడూరును తిరుప‌తి జిల్లాలో క‌లుపుతూ గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చారు.

గ‌త వైసీపీ ప్ర‌భుత్వ హ‌యాంలో 13 జిల్లాలు 26 జిల్లాలుగా ఏర్ప‌డ్డాయి. రాయ‌చోటి జిల్లా కేంద్రంగా అన్న‌మ‌య్య జిల్లా ఏర్ప‌డింది. జిల్లా కేంద్రంగా రాయ‌చోటిని క్యాన్సిల్ చేసి, మ‌ద‌న‌ప‌ల్లె (Madanapalle)ను జిల్లా కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటుకు మంత్రివ‌ర్గ స‌మావేశంలో ఆమోదం తెలిపారు.

గతంలో రాయచోటిని జిల్లా కేంద్రంగా మార్చుతున్నారన్న వార్తలను మంత్రి రాంప్రసాద్‌రెడ్డి (Minister Mandipalli Ramprasad Reddy) తీవ్రంగా ఖండించారు. మంత్రి పదవిని నిలబెట్టుకోవడానికి జిల్లా కేంద్రాన్ని తరలించడానికి తాను ఒప్పుకున్నాననేది వైసీపీ(YSRCP) దుష్ప్ర‌చార‌మ‌ని, అలాంటిది జరిగితే రాజీనామా చేస్తానని మంత్రి స్పష్టం చేశారు. గ‌తంలో ప్ర‌చారం జ‌రిగిన‌ట్టుగానే రాయచోటి ప్ర‌జ‌ల‌కు నిరాశ మిగిలింది. దీంతో అక్క‌డి స్థానిక ఎమ్మెల్యే, మంత్రి మండిప‌ల్లి రాంప్ర‌సాద్‌రెడ్డి మంత్రివ‌ర్గ స‌మావేశంలోనే భావోద్వేగానికి గురైన‌ట్లుగా వీడియో స‌ర్క్యులేట్ అవుతోంది. రాయ‌చోటిని జిల్లా కేంద్రంగా మార్చితే ఒప్పుకునేది లేద‌ని గ‌తంలో చెప్పిన మంత్రి రాంప్ర‌సాద్‌రెడ్డి.. ఇప్పుడు త‌న ప్రాంత ప్ర‌జ‌ల‌కు ఏం స‌మాధానం చెబుతార‌నే ప్ర‌శ్న‌లు ఉత్ప‌న్న‌మ‌వుతున్నాయి.

మ‌రిప్పుడు మంత్రి ఇచ్చిన మాట‌కు క‌ట్టుబ‌డి రాజీనామా చేస్తారా..? అనేది ఆ ప్రాంత ప్ర‌జ‌ల సెంటిమెంట్‌, ఆయ‌న నిర్ణ‌యంతో ముడిప‌డి ఉన్న అంశం. రాయ‌చోటిని జిల్లా కేంద్రంగా కాపాడుకోలేక‌పోయిన స్థానిక ఎమ్మెల్యే రాంప్ర‌సాద్‌రెడ్డికి రానున్న రోజుల్లో జిల్లా కేంద్రాన్ని కోల్పోయిన ప్ర‌జ‌ల నుంచి, ప్ర‌తిప‌క్షం నుంచి ఎలాంటి వ్య‌తిరేక‌త ఎదుర‌వుతుందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు.

అయితే భావోద్వేగానికి గురైన మంత్రి రాంప్ర‌సాద్‌రెడ్డికి సీఎం చంద్ర‌బాబు ఫోన్ చేసి ప‌రామ‌ర్శించార‌ట‌. రాయ‌చోటి అభివృద్ధి సంగ‌తిని తాను చూసుకుంటాన‌ని చంద్ర‌బాబు (Chandrababu Naidu) హామీ ఇచ్చార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. స‌చివాల‌యానికి ర‌మ్మ‌ని క‌బురు పంపించార‌ని, సీఎంతో మంత్రి భేటీ కానున్నార‌ని టీవీ ఛానెల్స్‌లో ప్ర‌సారాలు మొద‌ల‌య్యాయి. ఇన్నాళ్లూ జిల్లా కేంద్రంగా ఉన్న‌ రాయ‌చోటిని తొలగించినందుకు ఏమైనా ప్ర‌త్యేక నిధులు కేటాయిస్తారా..? దీనిపై ఎలాంటి స‌మాధానం చెబుతారో వేచి చూడాలి.

Join WhatsApp

Join Now

Leave a Comment