తెలంగాణ (Telangana)లో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసు (Phone Tapping Case) తుది దశకు చేరుకుంటున్నట్లు కనిపిస్తోంది. డీజీపీ, సీపీ సజ్జనార్ (CP Sajjanar) ఆధ్వర్యంలో తొమ్మిది మంది సభ్యులతో ఏర్పాటైన సిట్(SIT) ఇప్పటివరకు విస్తృతంగా దర్యాప్తు చేపట్టింది. ఈ విచారణలో అప్పట్లో కీలక బాధ్యతలు నిర్వహించిన మాజీ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో పాటు ప్రస్తుతం వివిధ హోదాల్లో ఉన్న అధికారులను కూడా ప్రశ్నించింది. అధికారుల స్థాయిలో విచారణ దాదాపు పూర్తవడంతో ఇప్పుడు రాజకీయ నేతలపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో అప్పటి ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన పలువురు నేతలకు నోటీసులు ఇవ్వాలని సిట్ భావిస్తున్నట్లు అంతర్గత సమాచారం. బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్(KCR), సీనియర్ నేత హరీష్‌రావు (Harish Rao)లకు నోటీసులు జారీ చేసే అవకాశాలపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. సోమవారం అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో, సమావేశాల అనంతరం నోటీసులు ఇచ్చే అవకాశం ఉందని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. నేతలను విచారించిన తర్వాత సుప్రీంకోర్టుకు నివేదిక సమర్పించాలన్నది సిట్ యోచనగా తెలుస్తోంది.
నోటీసుల అంశంపై ఇప్పటికే మాజీ మంత్రి హరీష్‌రావు స్పందించారు. ఈ కేసులో తమకు నోటీసులు వస్తాయన్న సమాచారం ఉందని, కాళేశ్వరం కమిషన్ (Kaleshwaram Commission) విచారణకు హాజరైనట్టే ఈ విచారణకు కూడా సిద్ధంగా ఉన్నామని ఆయన చెప్పారు. రాజకీయ నేతల విచారణ పూర్తైన తర్వాత జనవరి రెండో వారం దాటిన అనంతరం సిట్ సుప్రీంకోర్టు (Supreme Court)కు నివేదిక అందజేయనుందని సమాచారం. ఆ నివేదికపై న్యాయస్థానం మరింత లోతైన విచారణకు ఆదేశిస్తుందా, లేక సీబీఐకి కేసును అప్పగిస్తుందా అన్నది ఆసక్తికరంగా మారింది. మొత్తంగా ఫోన్ ట్యాపింగ్ కేసు బీఆర్ఎస్ నేతలకు వచ్చే ఏడాదిలోనూ సవాలుగా మారే అవకాశముందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.








