స్క్రబ్ టైఫస్ (Scrub Typhus) కేసులు ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రజలను భయపెడుతున్నాయి. ఈ ఏడాదిలో ఇప్పటివరకు 1806 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 15 మందికి పైగా మృతిచెందినట్లుగా సమాచారం. మరణాల సంఖ్య పెరుగుతుండటం ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. ఇప్పటికే ఈ వ్యాధి కారణంగా ఒకరు మృతి చెందగా, పలు ప్రాంతాల్లో కొత్త కేసులు నమోదు కావడంతో వైద్య, ఆరోగ్య శాఖలు అప్రమత్తమయ్యాయి.
అన్నమయ్య జిల్లా (Annamayya District) పీలేరు (Pileru) మండలం మోడల్ కాలనీకి చెందిన మంగమ్మ (Mangamma) స్క్రబ్ టైఫస్ జ్వరంతో బాధపడుతూ తిరుపతిలోని రుయా ఆసుపత్రిలో (RUYA Hospital) చికిత్స పొందుతూ మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనతో జిల్లాలో వ్యాధి తీవ్రతపై భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.
తాజాగా మదనపల్లి పట్టణంలో 9 స్క్రబ్ టైఫస్ కేసులు గుర్తించినట్లు వైద్య వర్గాలు వెల్లడించాయి. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు అన్నమయ్య జిల్లాలో మొత్తం 43 స్క్రబ్ టైఫస్ కేసులు నమోదు కావడం గమనార్హం. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఈ వ్యాధి వ్యాప్తి ఎక్కువగా కనిపిస్తోందని అధికారులు చెబుతున్నారు.
మదనపల్లి మండలం కోళ్ల బైలు పంచాయతీ పరిధిలోని చెరువుముందరపల్లి గ్రామంలో ఒక కేసు నమోదు కావడంతో స్థానిక అధికారులు తక్షణ చర్యలు చేపట్టారు. కోళ్ల బైలు–1, 2 పంచాయతీ సెక్రటరీలు, సిబ్బంది ప్రజలకు తగు జాగ్రత్తలు పాటించాలని సూచిస్తూ, చుట్టుపక్కల ప్రాంతాల్లో శానిటేషన్ కార్యక్రమాలు నిర్వహించారు.
అలాగే పరిసర గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, జ్వరం, తలనొప్పి, శరీర నొప్పులు వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే సమీప ప్రభుత్వ ఆసుపత్రిని సంప్రదించాలని వైద్యులు సూచిస్తున్నారు. స్క్రబ్ టైఫస్ నియంత్రణకు పరిశుభ్రత, వ్యక్తిగత జాగ్రత్తలు ఎంతో కీలకమని అధికారులు పేర్కొంటున్నారు.








