పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి (West Bengal State) సంబంధించిన ముసాయిదా ఓటర్ల జాబితాను (Draft Electoral Roll) కేంద్ర ఎన్నికల సంఘం (ECI) మంగళవారం విడుదల చేసింది. నవంబర్‌లో ప్రారంభించిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియలో భాగంగా నిర్వహించిన ప్రత్యేక సర్వే పూర్తికావడంతో ఈ ముసాయిదా జాబితాను ప్రకటించింది. ఈ సర్వే అనంతరం రాష్ట్రంలో 58 లక్షలకు పైగా ఓటర్ల (More than 5.8 million voters) పేర్లు జాబితా నుంచి తొలగించినట్లు (Deleted from the list) ఎన్నికల సంఘం వెల్లడించింది. తొలగించబడిన వారిలో చాలా మందికి సంబంధించి ఎలాంటి జాడ లభించలేదని పేర్కొంది.
నమోదైన చిరునామాల్లో ఓటర్లు లేనట్లు గుర్తించడం, శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు బదిలీ కావడం లేదా మరణించడం వంటి కారణాలతోనే ఈ పేర్లను తొలగించినట్లు ఈసీ వివరించింది. సవరించిన జాబితా ప్రకారం ప్రస్తుతం పశ్చిమ బెంగాల్‌లో 7.66 కోట్లకు పైగా ఓటర్లు ఉన్నట్లు తెలిపింది. మొత్తం 7,66,37,529 మంది ఓటర్లు ఈ సవరణ ప్రక్రియ పరిధిలోకి వచ్చినట్లు పేర్కొంది. ఓటర్ జాబితా సవరణ షెడ్యూల్‌ను అక్టోబర్ 27న ప్రకటించగా, నవంబర్ 4 నుంచి SIR ప్రక్రియ అధికారికంగా ప్రారంభమైంది.
ప్రత్యేక సర్వే అనంతరం అభ్యంతరాలు స్వీకరించడం, విచారణలు నిర్వహించే ప్రక్రియ ఫిబ్రవరి 2026 వరకు కొనసాగుతుందని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. తుది ఓటర్ల జాబితాను ఫిబ్రవరి 14న విడుదల చేసే అవకాశముందని తెలిపింది. వచ్చే ఏడాది ప్రారంభంలో తమిళనాడు, పశ్చిమ బెంగాల్, కేరళ, అస్సాం రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ ప్రత్యేక సర్వే చేపట్టినట్లు ఈసీ పేర్కొంది. ఇదే తరహాలో గతంలో బీహార్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా ఇలాంటి సర్వే నిర్వహించిన సంగతి తెలిసిందే.








