తెలంగాణ జాగృతి (Telangana Jagruthi) అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) తాజా వ్యాఖ్యలతో రాష్ట్ర రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. బీఆర్ఎస్(BRS), ముఖ్యంగా కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణరావుపై (Madhavaram Krishna Rao) కాంగ్రెస్ తో కలసి అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. తమపై ఈ విధంగా దాడులు చేస్తున్న వారిని “గుంట నక్కలు” (Wild Foxes) అని వ్యాఖ్యానించిన కవిత, “నా మీద తప్పుడు ఆరోపణలు చేస్తే ఒక్కొక్కడి తోలు తీస్తా… మీ చిట్టాలను బయటపెడతా” అంటూ కఠిన హెచ్చరిక జారీ చేశారు. ప్రజల మధ్య తిరిగితే వారి అవినీతి బయటపడుతుందని కూడా ఆమె వ్యాఖ్యానించారు.
హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని జాగృతి కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన కవిత, రాజకీయ ప్రత్యర్థులపై విమర్శలు కొనసాగిస్తూ..“ఇది జస్ట్ టాస్ మాత్రమే… అసలైన టెస్ట్ మ్యాచ్ ముందుంది” అని అన్నారు. పందెంకోళ్ల కేసులో కేటీఆర్ బినామీగా (KTR Benami) ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డిని (Pochampally Srinivas Reddy) పోలీసులు ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నిస్తూ, “నేను ఆడపిల్లనని లైట్ తీసుకుంటున్నారా? ఒక్కొక్కడి తోలు తీస్తా” అంటూ ఘాటు హెచ్చరికలు చేశారు.
ఇక తాను చేసిన ఆరోపణలు అసత్యమని పేర్కొంటూ, BJP ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి, BRS ఎమ్మెల్యే మాధవరం కృష్ణరావు, అలాగే టీ న్యూస్ ఛానల్‌కు కవిత లీగల్ నోటీసులు పంపించారు. వారం రోజుల్లో బహిరంగ క్షమాపణ చెప్పాలని, లేనిపక్షంలో న్యాయపరమైన చర్యలు తీసుకుంటానని ఆమె స్పష్టం చేశారు. రాజకీయ దాడులు, ఆరోపణల నేపథ్యంలో కవిత తాజా వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీశాయి.








