తిరుపతిలోని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం (Tirupati National Sanskrit University)లో ఫస్ట్ ఇయర్ విద్యార్థిని (Female Student)పై అసిస్టెంట్ ప్రొఫెసర్ (Assistant Professor) లైంగిక దాడి (sexual Assault) చేసిన ఘటన దేశవ్యాప్తంగా ఆగ్రహాన్ని రేకెత్తిస్తోంది. ఈ ఘటనపై తిరుపతి వైసీపీ ఎంపీ గురుమూర్తి (Gurumurthy), ఒడిశా రాష్ట్ర కోరాపుట్ ఎంపీ శంకర్ ఉలాక (Shankar Ulaka) కలిసి లోక్‌సభలో వాయిదా తీర్మానం కోరడం ఈ కేసుకు జాతీయ స్థాయిలో ప్రాధాన్యం తీసుకొచ్చింది. విద్యార్థిని అంశాన్ని ఇప్పటికే జాతీయ ఎస్సీ కమిషన్, కేంద్ర విద్యాశాఖ మంత్రి, జాతీయ మహిళా కమిషన్‌ల దృష్టికి తీసుకెళ్లానని ఎంపీ గురుమూర్తి వెల్లడించారు.
నవంబర్ 24న విద్యార్థిని యూనివర్సిటీ యాంటీ సెక్సువల్ హెరాస్మెంట్ కమిటీకి ఫిర్యాదు చేసినప్పటికీ, సరైన చర్యలు తీసుకోకపోవడం ఆందోళనకరమని ఆయన విమర్శించారు. ఆలస్యం చేసిన విశ్వవిద్యాలయ అధికారుల ధోరణిపై విద్యార్థి సంఘాలు తీవ్రస్థాయిలో ఆందోళన చేపట్టడంతో, యూనివర్సిటీ నిర్వాహకులు చర్యలు తీసుకోవాల్సి వచ్చింది. విద్యార్థి సంఘాల ఒత్తిడితో కేసు మరింత వేగంగా ముందుకు కదిలేలా పరిస్థితులు మారాయి.
ఈనెల 6వ తేదీ రాత్రి తిరుపతి వెస్ట్ పోలీస్ స్టేషన్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌పై అధికారికంగా ఫిర్యాదు నమోదైంది. వెంటనే పోలీసులు CR No. 183/2025 కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ కేసు విచారణ బాధ్యతను తిరుపతి ఈస్ట్ డీఎస్పీ భక్తవత్సలంకు అప్పగించి, ఇద్దరు మహిళా సబ్-ఇన్‌స్పెక్టర్‌లను విచారణ బృందంలో చేర్చినట్లు సమాచారం. ఘటనకు సంబంధించిన కీలక ఆధారాలుగా రెండు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకుని, వాటిని ఫోరెన్సిక్ పరీక్షలకు (FSL) పంపారు.
ఈ ఘోర ఘటనపై విద్యార్థి సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. నేషనల్ సంస్కృత యూనివర్సిటీ ఎదుట పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలకు పిలుపునిచ్చాయి. విద్యార్థుల భద్రత, దుర్వినియోగం నివారణ, యూనివర్సిటీల్లో పారదర్శక విధానాల కోసం కీలక చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. కేసు విచారణ వేగవంతం కావడంతో పాటు, విద్యార్థినికి పూర్తి న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగుతుందని సంఘాలు ప్రకటించాయి.








