ఏపీలో కూటమి ప్రభుత్వం తీసుకున్న మరో నిర్ణయంపై యాదవ సంఘాలు మండిపడుతున్నాయి. గతంలో వైసీపీ ప్రభుత్వం యాదవుల భవనం కోసం కేటాయించిన భూమిని ఇప్పుడు కూటమి ప్రభుత్వం వెనక్కు తీసుకోవాలనుకోవడమే ఇందుకు కారణం. విశాఖలో యాదవ సంఘాల భవనం కోసం వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో ఎండాడ హైవే సమీపంలో 50 సెంట్ల విలువైన భూమిని కేటాయించారు. ఆ భూమి మార్కెట్ విలువ రూ.50 కోట్లకు పైగా ఉండగా, అక్కడే యాదవ భవన నిర్మాణానికి భూమి పూజ కూడా జరిగింది. అయితే, తాజాగా కూటమి ప్రభుత్వం ఆ భూమి కేటాయింపును రద్దు చేయడం యాదవ సమాజంలో తీవ్ర అసంతృప్తికి దారితీసింది.
కూటమి ప్రభుత్వం కొత్తగా కేటాయించిన భూమి హైవేకూ దూరంగా, మారుమూల ప్రాంతంలో, తక్కువ రేటు ఉన్న స్థలమని యాదవ నేతలు విమర్శిస్తున్నారు. వైఎస్ జగన్ కేటాయించిన విలువైన భూమిని తొలగించి, సుదూర మారుమూల ప్రాంతంలో యాదవ భవనం ఏర్పాటు చేయడం రాజకీయ దురుద్దేశంతో తీసుకున్న నిర్ణయమని వారు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయంపై వైసీపీ అనుబంధ యాదవ సంఘాల నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
వైఎస్ జగన్ హయంలో యాదవులకు ప్రత్యేక ప్రాధాన్యం లభించిందని యాదవ నేతలు గుర్తుచేస్తున్నారు. విశాఖలో అనేక కీలక పదవులు యాదవులకు అప్పగించడంతో పాటు, వారి సమాజం అభివృద్ధికి ప్రత్యేకంగా భూమి కేటాయించారని చెబుతున్నారు. కానీ, ఇప్పుడు ఆ స్థలాన్ని రద్దు చేసి తక్కువ విలువ గల భూమి కేటాయించడం యాదవులపై వివక్షతో తీసుకున్న చర్యగా భావిస్తున్నారు.
ఈ నిర్ణయం పూర్తిగా రాజకీయ ప్రయోజనాల కోసమే తీసుకున్నదని యాదవ నాయకులు మండిపడుతున్నారు. “యాదవులకు ఇచ్చిన హక్కులను, అభివృద్ధి అవకాశాలను తగ్గించే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తోంది” అని విశాఖ తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ మేయర్ హరి వెంకట కుమారి వ్యాఖ్యానించారు. ఈ వివాదంతో విశాఖలో రాజకీయ వేడి మరింత పెరిగింది.








