ఆంధ్రప్రదేశ్‌లో స్క్రబ్ టైఫస్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. రాష్ట్రంలో పెరుగుతున్న కేసులు ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఇటీవల విజయనగరం జిల్లాలో స్క్రబ్ టైఫస్ వ్యాధితో మహిళ మృతిచెందగా, తాజాగా పల్నాడు జిల్లాలో ఇద్దరు మహిళలు ఈ వ్యాధితో మరణించారు. ముప్పాళ్ల మండలం రుద్రవరంలోని జ్యోతి (20), రాజుపాలెం ఆర్ఆర్ సెంటర్‌కు చెందిన నాగమ్మ (62) మృతిచెందారు. ముగ్గురు మహిళలు స్క్రబ్ టైఫస్‌తో ప్రాణాలు కోల్పోవడం రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనను పెంచుతోంది.
చిత్తూరు జిల్లాలో పరిస్థితి మరింత తీవ్రమైంది. ఇప్పటి వరకు జిల్లాలో 380కి పైగా కేసులు నమోదైనట్లు వైద్య అధికారులు తెలిపారు. ఈ వ్యాధి ముఖ్యంగా ఆగస్టు నుంచి ఫిబ్రవరి మధ్య కాలంలో ఎక్కువగా విస్తరిస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కీటకం కాటు వల్ల వచ్చే ఇన్ఫెక్షన్ వేగంగా పెరుగుతోందని సూచిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాలు ఈ వ్యాధికి ఎక్కువగా గురవుతుండటంతో అక్కడ ప్రజలు ప్రత్యేకంగా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
సకాలంలో చికిత్స అందితే మరణాల రేటు 2% లోపు ఉంటుందనే వైద్య నిపుణుల మాటలు కొంత ఊరటనిస్తున్నాయి. అయితే చికిత్స ఆలస్యమైతే పరిస్థితి విషమించి రోగి కోమాలోకి వెళ్లే అవకాశం ఉంది. తీవ్రత ఆధారంగా మరణాల రేటు 6% నుంచి 30% వరకు పెరిగే ప్రమాదం ఉందన్నారు. అంతేకాకుండా ఈ వ్యాధిని గుర్తించడానికి అవసరమైన పరీక్షలు ప్రస్తుతం విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం, కాకినాడ, తిరుపతి వంటి కొద్ది పెద్ద ఆస్పత్రుల్లో మాత్రమే అందుబాటులో ఉన్నాయి.








