గౌహతి (Guwahati) వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ (Second Test Match)లో దక్షిణాఫ్రికా జట్టు (South Africa Team) భారత్ (India)కు భారీ లక్ష్యాన్ని నిర్దేశించి, మ్యాచ్‌పై పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో ఏకంగా 489 పరుగుల భారీ స్కోర్‌ను నమోదు చేసింది. ముత్తుస్వామి (109) శతకంతో పాటు జాన్సెన్ (93), వెర్రీన్ (45), స్టబ్స్స్ (49) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ నాలుగు వికెట్లు పడగొట్టి కొంతవరకు అడ్డుకోగా, బుమ్రా, జడేజా చెరో రెండు వికెట్లు తీశారు.
అయితే, ఈ భారీ స్కోర్‌కు సమాధానంగా భారత్ తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 201 పరుగులకే ఆలౌట్ అయింది. యశస్వీ జైస్వాల్ (58) మినహా మిగతా బ్యాట్స్‌మెన్ ఎవరూ రాణించలేకపోయారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో మార్కో జాన్సెన్ ఏకంగా ఆరు వికెట్లు తీసి భారత బ్యాటింగ్ ఆర్డర్‌ను దెబ్బ తీశారు.
రెండో ఇన్నింగ్స్‌లో కూడా దక్షిణాఫ్రికా దూకుడుగా ఆడి, 260/5 వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. ట్రిస్టన్ స్టబ్స్స్ (94) సెంచరీకి చేరువగా వచ్చి కీలక ఇన్నింగ్స్ ఆడగా, టోనీ డి జార్జీ (49) కూడా చక్కగా సహకరించాడు. ఈ ఇన్నింగ్స్‌లో జడేజా నాలుగు వికెట్లు తీసినప్పటికీ ఫలితం లేకపోయింది. దీనితో భారత్‌కు మొత్తం 549 పరుగుల అసాధ్యమైన లక్ష్యాన్ని దక్షిణాఫ్రికా నిర్దేశించింది. ప్రస్తుతం రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన టీమిండియాకు విజయానికి అవసరమైన పరుగులు భారీగా ఉండడంతో గెలుపు దిశగా పయనం దాదాపు అసాధ్యంగా మారింది. అన్ని విభాగాల్లోనూ దక్షిణాఫ్రికా ఆధిపత్యం కారణంగా, ఈ టెస్ట్ సిరీస్‌లో భారత్‌కు వైట్‌వాష్ ప్రమాదం పొంచి ఉంది. భారత్ కనీసం ఈ మ్యాచ్‌ను డ్రా వైపు నడిపించగలుగుతుందో లేదో చూడాలి.








