ఐబొమ్మ రవికి పెరుగుతున్న క్రేజ్‌.. యూజ‌ర్ల రీల్స్, మీమ్స్‌

ఐబొమ్మ రవికి పెరుగుతున్న క్రేజ్‌.. యూజ‌ర్ల రీల్స్, మీమ్స్‌

ఐబొమ్మ (iBomma) వ్యవస్థాపకుడు ఇమ్మిడి రవి (Immdi Ravi) అరెస్ట్‌ మరియు రిమాండ్‌ అనంతరం ఆయనపై దేశవ్యాప్తంగా చర్చ ముమ్మరమైంది. సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖ నిర్మాతలు, హీరోలు రవిని కఠినంగా శిక్షించాలంటూ ఎన్‌కౌంటర్ వరకూ డిమాండ్ చేస్తుండగా, యూజ‌ర్లు మాత్రం సినీ ఇండ‌స్ట్రీకి పూర్తి విరుద్ధంగా వాద‌న‌లు వినిపిస్తున్నారు. రవిని ‘టెక్ దిగ్గజం’(Tech Giant)గా నెటిజన్లు అభివ‌ర్ణిస్తున్నారు.

సోషల్ మీడియా వేదికలైన యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌లలో రవికి మద్దతుగా వేల సంఖ్యలో కామెంట్లు, వీడియోలు, రీల్స్ వస్తున్నాయి. ఆయన అరెస్టు తర్వాత మరింతగా ఐబొమ్మ ట్రెండ్ అవుతుండటం గమనార్హం. ఓ సినిమా ఫంక్షన్‌లో నటుడు శివాజీ (Shivaji) “దేశ సేవ కోసం రవి టాలెంట్‌ను వాడుకుంటే బాగుంటుంది” అని చేసిన వ్యాఖ్యలు సైతం వైరల్ అవుతున్నాయి.

పేదవాడి కోసం ఐబొమ్మా?
రవి విచారణలో బయటపడిన అంశాలు కూడా ప్రజాదరణ పెరగడానికి కారణమయ్యాయి. కుటుంబపరమైన ఒత్తిళ్లు, సంపాదనపై భార్య, అత్తల విమర్శల మధ్య రవి ఐబొమ్మను సృష్టించినట్టు సమాచారం. క్లారిటీ కాస్త అటుఇటుగా ఉన్నా.. సినిమా థియేటర్లకు వెళ్లలేని వారికి తక్కువ డేటాలో (తక్కువ MB) సినిమాలు అందించడం వల్ల ర‌వి సృష్టించిన‌ వెబ్‌సైట్ వేగంగా ప్రజాదరణ పొందింది. “టికెట్‌ ధరలు ఎక్కువ… అందుకే ఐబొమ్మ నాకు ఉపయోగపడింది!” అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతూ ర‌వికి మద్దతుగా నిలుస్తున్నారు.

సినీ పరిశ్రమపై యూజ‌ర్ల అసంతృప్తి
“బాక్స్ ఆఫీస్ కలెక్షన్ల కోసం టికెట్ ధరలు పెంచుతూ వచ్చారు… మా లాంటి సామాన్యులు సినిమా ఎలా చూడాలి?” అని రవి సపోర్టర్లు సినీ ప్రముఖులను ప్రశ్నిస్తున్నారు. థియేటర్లోకి ప్రేక్షకులను రప్పించడానికి ఎలాంటి ప్రయత్నం చేయకుండా ‘రికార్డులు–కలెక్షన్లు’ అనే పేరుతో టికెట్ ధరలను పెంచుతుంటే, ప్రత్యామ్నాయాలు వెతకడం తప్ప ప్రజలకు మార్గం లేదని వాదిస్తున్నారు.

‘ఇమ్మడి రవి బయోపిక్’
ఐబొమ్మ రవి హవా సోషల్ మీడియాలో పెరుగుతుండగా, ఇప్పుడు ఆయన జీవితం వెండితెరపైకి వచ్చే దిశగా అడుగులు పడాయి. ‘తేజ్ క్రియేటివ్ వర్క్స్’ అనే నిర్మాణ సంస్థ రవి జీవితంపై బయోపిక్ తీసేందుకు సిద్ధమైంది. సినిమాలో రవి జీవితంలో జరిగిన తెలియని సంగతులు, ఆయన చేసిన పోరాటాలు, ఎదుర్కొన్న అవమానాలు, అలాగే ఐబొమ్మ వెనుక ఉన్న చీకటి కోణాలను కూడా వెలుగులోకి తీసుకువస్తున్న‌ట్లుగా స‌మాచారం. దీంతో ‘ఇమ్మడి రవి బయోపిక్’పై ప్రేక్షకుల్లో భారీ ఆసక్తి నెలకొంది. సోషల్ మీడియాను కుదిపేసిన ఈ వ్యక్తి జీవితం తెరపై ఎలా చూపిస్తారన్న ఉత్కంఠ పెరుగుతోంది.

Join WhatsApp

Join Now

Leave a Comment