తండ్రి అంత్యక్రియల (Funeral Rites) కోసం లండన్ నుంచి స్వగ్రామానికి వచ్చిన ఎన్నారై భాస్కర్‌రెడ్డి (Bhaskar Reddy)ని పెనమలూరు పోలీసులు అరెస్టు చేశారు. వైసీపీ(YSRCP) అధికారంలో ఉండగా చంద్రబాబు(Chandrababu), లోకేష్(Lokesh)లపై అసభ్యకర పోస్టులు పెట్టారనే కారణంతో అన్ని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. భాస్కర్‌రెడ్డి స్వగ్రామం పెనమలూరు నియోజకవర్గం చోడవరం (Chodavaram).
కాగా, ఎన్నారై భాస్కర్ రెడ్డికి సెకండ్ అడిషనల్ చీఫ్ జ్యూడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టు ఈనెల 21వ తేదీ వరకు రిమాండ్ విధించింది. అనంతరం భాస్కర్ రెడ్డిని నెల్లూరు సెంట్రల్ జైలుకు తరలించాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. రిమాండ్ విచారణ సందర్భంగా భాస్కర్ రెడ్డి జడ్జి ఎదుట కన్నీటి పర్యంతమయ్యారు. పోలీసులు తనను తీవ్రంగా కొట్టారని, అసభ్యకరంగా దూషించారని చేశారని జడ్జి ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు.
పోలీసుల తీరుపై న్యాయమూర్తి అసహనం వ్యక్తం చేశారు. భాస్కర్ రెడ్డిని కొట్టినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరు సీఐలు, ఒక ఎస్సైకి అప్పటికప్పుడే న్యాయమూర్తి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఈ విషయంపై వివరణ ఇవ్వాలని న్యాయమూర్తి ఆదేశించారు. అదేవిధంగా, భాస్కర్ రెడ్డి వద్ద న్యాయమూర్తి స్వయంగా వాంగ్మూలం నమోదు చేశారు.
అదనంగా, భాస్కర్ రెడ్డికి మరోసారి విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో వైద్య పరీక్షలు చేయాలని కోర్టు ఆదేశించింది. వైద్య పరీక్షలు స్పెషలిస్ట్ వైద్యుడి సమక్షంలో నిర్వహించాలనీ, ఆ పరీక్షల వీడియో తీసి కోర్టుకు సమర్పించాలనీ ఆదేశాలు జారీ చేసింది. హెల్త్ రిపోర్ట్‌ను సీల్డ్ కవర్‌లో కోర్టుకు అందించాలని కూడా సూచించింది. ఈనెల 13న తన తండ్రి పెద్దకర్మ కార్యక్రమానికి హాజరయ్యేందుకు భాస్కర్ రెడ్డికి అనుమతి ఇవ్వాలని కూడా కోర్టు నిర్ణయించింది.








