డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని రామచంద్రపురంలో ఓ చిన్నారి ఆత్మహత్య ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపుతోంది. భాష్యం స్కూల్‌లో ఐదో తరగతి చదువుతున్న 11ఏళ్ల రంజిత అనే బాలిక, ఇంట్లో ఎవరూ లేని సమయంలో చున్నీతో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం. ఉదయం స్కూలుకు వెళ్లిన బాలిక, సాయంత్రానికి ఇలాంటి దారుణానికి పాల్పడటంతో కుటుంబసభ్యులు, స్థానికులు షాక్‌కు గురయ్యారు.
అయితే, ఈ ఘటనపై స్థానికంగా అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. 11 ఏళ్ల బాలికకు ఉరి వేసుకోవడం ఏంటని, అసలు ఆ చిన్నారికి ఉరి అంటే ఏంటో తెలుసా..? అని కుటుంబ సభ్యులు, స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. “ఇది నిజంగా ఆత్మహత్యేనా, లేక ఎవరో హత్య చేసి ఆత్మహత్యలా చిత్రీకరించారా?” అనే ప్రశ్నలు లేవనెత్తుతున్నారు.
బాధితురాలి తల్లి సునీత స్థానిక ఏరియా ఆసుపత్రిలో స్టాఫ్ నర్స్‌గా పనిచేస్తుండగా, తండ్రి రాజు ముంబైలో మెరైన్ ఇంజనీర్‌గా ఉద్యోగం చేస్తున్నారు. రంజితకు ఒక అక్క ఉండగా, ఆమె నవోదయ పాఠశాలలో 9వ తరగతిలో చదువుతోంది. ఘటన సమయంలో తల్లి కాకినాడలోని బంధువుల ఇంటికి వెళ్లి ఉండగా, తిరిగి వచ్చేసరికి ఈ విషాదం చోటు చేసుకుంది. బాలిక మృతికి గల కారణాలను తెలుసుకునేందుకు రామచంద్రపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే చిన్నారులపై ఇలాంటి ఘటనలు ఎందుకు చోటుచేసుకుంటున్నాయని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
సుగాలి ప్రీతిని గుర్తుచేస్తున్న ఘటన
ఈ దుర్ఘటన సుగాలి ప్రీతి ఘటనను గుర్తుచేస్తోంది. కర్నూలు శివారులోని కట్టమంచి రామలింగారెడ్డి రెసిడెన్షియల్ స్కూల్ హాస్టల్‌లో పదో తరగతి చదువుతున్న సుగాలి ప్రీతి 2017 ఆగస్టు 19 తేదీన అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. తన కుమార్తె మృతదేహంపై చేతులు, కాళ్లపై గాయాలున్నాయన, ఇది సహజ మరణం కాదని, ప్రీతిని లైంగికంగా దాడి చేసి హత్యచేసి ఆత్మహత్యగా నాటకమాడారు ప్రీతి తల్లి ఆరోపించింది. సుగాలి ప్రీతి అంశాన్ని కొంతమంది ఎన్నికల ప్రచార అస్త్రంగా మార్చుకొని, అధికారంలోకి వచ్చాక ఆ తల్లికి న్యాయం చేయకుండా వదిలేశారు. నేటికీ ఆ తల్లి పార్వతీదేవి న్యాయం కోసం పోరాడుతూనే ఉంది.








