దేశాన్ని ప్రపంచ ఛాంపియన్‌గా మార్చిన అసలు హీరో

దేశాన్ని ప్రపంచ ఛాంపియన్‌గా మార్చిన అసలు హీరో

భారత మహిళా క్రికెట్ (India Women’s Cricket) జట్టు(Team) కోట్లాది మంది కల నెరవేరుస్తూ వన్డే ప్రపంచకప్‌ (ODI World Cup)ను గెలుచుకోవడంలో ప్రధాన కోచ్ (Main Coach) అమోల్ ముజుందార్ (Amol Muzumdar) కీలక పాత్ర పోషించాడు. ముంబైకి చెందిన ఈ మాజీ రంజీ ప్లేయర్ తన కెరీర్‌లో టీమిండియా జెర్సీ ధరించకపోయినా, దేశం కోసం ఆడిన వారు కూడా సాధించలేని అపూర్వ విజయాన్ని సాధించి పెట్టాడు. 171 ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లలో 11,000 పరుగులు చేసినప్పటికీ, జాతీయ జట్టులో అవకాశం దక్కని నిరాశను తన కోచింగ్ విజయంతో తుడిచిపెట్టుకున్నాడు.

అక్టోబరు 2023లో భారత మహిళా జట్టు కోచ్‌గా నియమితులైనప్పుడు వచ్చిన విమర్శలను ఆయన పట్టించుకోలేదు. జట్టులోని క్రీడాకారుల బలహీనతలను అధిగమించేలా అనునిత్యం ప్రోత్సహిస్తూ, వారిని గెలుపు దిశగా నడిపించాడు. సెమీ-ఫైనల్‌కు ముందు డ్రెస్సింగ్ రూమ్ వైట్‌బోర్డ్‌పై ఆయన రాసిన సరళమైన వాక్యం, “ఫైనల్‌కు చేరుకోవడానికి మనం వారి కంటే ఎక్కువ పరుగులు చేయాలి, అంతే,” జట్టుపై ఎంత ప్రభావం చూపిందో కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ స్వయంగా వెల్లడించారు.

ముజుందార్ శిక్షణలో రాటుదేలిన టీమిండియా, 2005, 2017 ఫైనల్స్ ఓటమి చరిత్రను మార్చి, తొలిసారిగా ట్రోఫీని ముద్దాడింది. ఫైనల్ విజయం అనంతరం, ఆనందంతో కన్నీళ్లతో ఉన్న ముజుందార్‌ పాదాలను కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ తాకి ఆలింగనం చేసుకోవడం, కోచ్ పట్ల జట్టుకు ఉన్న అపారమైన గౌరవాన్ని, కృతజ్ఞతను సూచిస్తుంది. “గత రెండు సంవత్సరాలుగా సర్ సహకారం అద్భుతంగా ఉంది.

ఆయన వచ్చిన తర్వాత అంతా బాగానే జరిగింది. పగలు, రాత్రి ప్రాక్టీస్ చేయించి, ఆట తీరును మెరుగుపరుచుకోవాలో చెప్పారు,” అని హర్మన్‌ప్రీత్ ముజుందార్‌ను ప్రశంసించారు. ఈ విజయం ముజుందార్ అంతర్జాతీయ క్రికెట్ ఆడలేకపోయిన బాధను పూర్తిగా తొలగించి, ఆయనే నిజమైన ఛాంపియన్ అని నిరూపించింది.

Join WhatsApp

Join Now

Leave a Comment