ఆంధ్రరాష్ట్ర (Andhra State) వ్యాప్తంగా మొంథా తుఫాన్ (Montha Cyclone) ప్రభావం పెరుగుతోంది. తుఫాన్ ప్రస్తుతం కాకినాడకు 270 కిలోమీటర్ల దూరంలో పశ్చిమ-ఉత్తర దిశగా కేంద్రీకృతమై ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తీరప్రాంతాల్లో గాలుల వేగం గంటకు 70 నుంచి 90 కిలోమీటర్ల వరకు నమోదవుతోంది.
సముద్రంలో భారీ అలలు ఎగసిపడుతుండగా, మత్స్యకారుల సముద్ర యాత్రలకు పూర్తిగా నిషేధం విధించారు. కాకినాడ నుంచి విశాఖపట్నం (Kakinada to Visakhapatnam) వరకు తీరప్రాంతాల్లో మొంథా తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. అనేక ప్రాంతాల్లో కుండపోత వర్షాలు కురుస్తుండగా, లోతట్టు ప్రాంతాల్లో నీటిమునిగిన పరిస్థితులు ఉత్పన్నమయ్యాయి.
వాతావరణ శాఖ తాజా అంచనాల ప్రకారం, ఈ రాత్రి మొంథా తుఫాన్ మచిలీపట్నం – కాకినాడ మధ్య తీరం దాటే అవకాశం ఉంది. తుఫాన్ తీరం దాటే సమయానికి గాలుల వేగం గంటకు 90–110 కిలోమీటర్ల వరకు పెరగవచ్చని హెచ్చరించారు.
తుఫాన్ ప్రభావం ప్రధానంగా కృష్ణా, ఏలూరు, కాకినాడ, కోనసీమ జిల్లాలపై ఉండే అవకాశం ఉంది. ఇప్పటికే వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. నదుల్లో నీటి మట్టం వేగంగా పెరుగుతోంది. రహదారులపై వర్షపు నీరు నిల్వ ఉండటంతో పలు ప్రాంతాల్లో రవాణా అంతరాయం ఏర్పడింది. అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉంది. పునరావాస కేంద్రాలను సిద్ధం చేస్తూ, తీర ప్రాంత ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలించే ప్రక్రియ కొనసాగుతోంది.








