హాస్యం, వినూత్న పాత్రలతో ఆకట్టుకునే అల్లరి నరేష్ (Allari Naresh) నటిస్తున్న తాజా థ్రిల్లర్ చిత్రం ’12A రైల్వే కాలనీ’ (12A Railway Colony) విడుదలకు సిద్ధమైంది. ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా నవంబర్ 21వ తేదీన థియేటర్లలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ తాజాగా ప్రకటించారు.
శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాసా (Srinivasa) చిట్టూరి నిర్మిస్తున్న ఈ చిత్రంతో నాని కాసరగడ్డ (Nani Kasaragadda) దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ‘పోలిమేర’ సిరీస్ ఫేమ్ డా. అనిల్ విశ్వనాథ్ ఈ చిత్రానికి షోరన్నర్‌గా వ్యవహరించడంతో పాటు కథ, స్క్రీన్‌ప్లే, సంభాషణలను అందించడం విశేషం.
విడుదలైన పోస్టర్‌లు, వీడియోలు అల్లరి నరేష్ విభిన్నమైన పాత్రను, కథలోని థ్రిల్లింగ్ మరియు రొమాంటిక్ కోణాలను సూచిస్తున్నాయి. ఈ చిత్రం విడుదలయ్యే వారంలో ఇతర పెద్ద సినిమాలు లేకపోవడం వల్ల, బాక్సాఫీస్ వద్ద మంచి ప్రయోజనం పొందే అవకాశం ఉందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. డా. కామాక్షి భాస్కర్ల కథానాయికగా నటిస్తుండగా, సాయి కుమార్, వైవా హర్ష, గెటప్ శ్రీను వంటి వారు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించారు. విడుదల తేదీ ఖరారు కావడంతో, చిత్ర బృందం త్వరలో ప్రచార కార్యక్రమాలను ముమ్మరం చేయనుంది.







