కర్నూలు (Kurnool) జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం (Terrible Road Accident) చోటుచేసుకుంది. కల్లూరు మండలం చిన్నటేకూరు సమీపంలో జరిగిన ఈ ఘటనలో కావేరి ట్రావెల్స్‌కు చెందిన బస్సు మంటల్లో పూర్తిగా దగ్ధమైంది. ఈ ప్రమాదంలో 20 మందికి పైగా ప్రయాణికులు మృతిచెందినట్టు సమాచారం.
హైదరాబాద్ (Hyderabad) నుంచి బెంగళూరు (Bengaluru) వెళ్తున్న డీడీ 01 ఎన్ 9490 నంబర్ బస్సు మార్గమధ్యలో ఒక బైక్‌ను ఢీకొట్టడంతో మంటలు చెలరేగాయి. వెంటనే బస్సుకు మంటలు అంటుకొని, క్షణాల్లోనే బస్సు మొత్తం మంటల్లో చిక్కుకుంది. బస్సులో ఆ సమయంలో సుమారు 40 మంది ప్రయాణికులు, ఇద్దరు డ్రైవర్లు ఉన్నారు.
సమాచారం అందుకున్న వెంటనే ఫైర్ సర్వీస్, పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని సహాయక చర్యలు ప్రారంభించారు. గాయపడిన వారిని కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుల్లో అత్యధికంగా హైదరాబాద్‌కు చెందినవారుగా పోలీసులు గుర్తిస్తున్నారు. మంటల తీవ్రత వల్ల హైవేపై భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. బస్సు పూర్తిగా కాలిపోయిన దృశ్యాలు చూసిన వారందరూ విషాదంలో మునిగిపోయారు.
అగ్నిప్రమాదానికి గల ఖచ్చితమైన కారణం ఇంకా తెలియరాలేదు. బస్సు వేగం, ఇంధన లీకేజ్ లేదా షార్ట్ సర్క్యూట్ కారణమా అనే దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. జిల్లా అధికారులు ఘటన స్థలంలో శిబిరం ఏర్పాటు చేసి, సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.
బస్సు ఫిట్‌నెస్, ఇన్సూరెన్స్, పొల్యూషన్ పత్రాల గడువు గతంలోనే ముగిసిందని, బస్సు నిర్మాణంలోనూ భద్రతా ప్రమాణాలు లేవని పోలీస్ అధికారి పేర్కొనడంతో ట్రావెల్స్ నిర్వాహకుల నిర్లక్ష్యం స్పష్టమవుతోంది. బైక్ నడుపుతున్న శివ శంకర్ కూడా ఈ ఘటనలో మరణించాడు.








