పల్నాడు (Palnadu) జిల్లా నరసరావుపేట మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి (Gopireddy Srinivas Reddy)పై తాజాగా కేసు నమోదైంది. రెండు రోజుల క్రితం నరసరావుపేటలో పోలీసులు అనుమతి లేకుండా ర్యాలీ నిర్వహించారనే ఆరోపణలపై ఈ కేసు(Case) నమోదు చేశారు. పోలీస్ యాక్ట్ 30 అమల్లో ఉన్నప్పటికీ, గోపిరెడ్డి తన అనుచరులతో కలిసి ర్యాలీ (Rally)లో పాల్గొన్నారు. ఈ ఘటనకు సంబంధించి, గోపిరెడ్డితో పాటు మరో 22 మంది అనుచరులపై నరసరావుపేట వన్ టౌన్ పోలీస్స్టేషన్లో పోలీసులు కేసు నమోదు చేశారు.
అసలేం జరిగింది?
రాష్ట్రంలో నకిలీ మద్యం విక్రయాలను అరికట్టాలని డిమాండ్ చేస్తూ, మంగళవారం నరసరావుపేటలో మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి నాయకత్వంలో వైసీపీ నాయకులు ర్యాలీ నిర్వహించారు. వైసీపీ కార్యాలయం నుంచి ఎక్సైజ్ కార్యాలయం వరకు ఈ ర్యాలీ జరిగింది. ఈ సందర్భంగా వారు నకిలీ మద్యం బాటిళ్లను పగలగొట్టి నిరసన తెలిపారు.
అనంతరం, చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) బెల్ట్ షాపుల ద్వారా నకిలీ మద్యం డోర్ డెలివరీ చేయిస్తున్నారని విమర్శిస్తూ, ఈ విషయమై ఎక్సైజ్ సీఐకి వినతిపత్రం అందజేశారు. ఈ ర్యాలీపైనే తాజాగా పోలీసులు కేసు నమోదు చేశారు.








