విజయనగరం (Vizianagaram) జిల్లా పైడితల్లి (Paidithalli) అమ్మవారి జాతర (Festival) ఈసారి వివాదాలకు కేంద్రబిందువైంది. రాష్ట్ర మాజీ మంత్రి, శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ (Botcha Satyanarayana) ఈ ఉత్సవం సక్రమంగా జరగలేదని ఆరోపించారు. సిరిమానోత్సవం రోజున బొత్స సత్యనారాయణ కుటుంబం కూర్చున్న వేదిక కూలిపోయిన సంగతి తెలిసిందే. ఆరోజున పండుగ సజావుగా జరగాలని, తరువాత అన్ని విషయాలపై మాట్లాడుతానని చెప్పిన బొత్స.. శుక్రవారం విలేకరుల సమావేశంలో సంచలన వ్యాఖ్యలు చేశారు.
బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ, “పండగ కోసం ప్రభుత్వ కార్యాలయాల్లో హుండీలు పెట్టారు. ప్రజల నుంచి బలవంతంగా వసూళ్లు చేశారు. సిరిమానోత్సవం రోజున మా కుటుంబం కూర్చున్న వెంటనే స్టేజీ కూలిపోయింది. నా మీద కుట్ర జరిగిందా, లేక అలసత్వమా అనేది తేల్చాలి” అని అన్నారు. సిరిమానోత్సవంలో తాము కూర్చున్న వేదిక కూలిపోవడంతో పలువురు గాయపడ్డారని ఆయన వెల్లడించారు.
“ప్రతిపక్ష నేత పట్ల ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం బాధాకరం. గవర్నర్‌కు లేఖ రాసి వివరణ కోరుతాం. ఇప్పటికే సీఎస్(CS)కు లేఖ పంపాను” అని బొత్స చెప్పారు. ఇక ఇదిలా ఉంటే 30 ఏళ్లుగా సిరిమానోత్సవం వీక్షిస్తున్న ప్రదేశంలో ఈసారి బొత్స కుటుంబానికి అనుమతి ఇవ్వలేదని ఆయన అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ(TDP) నేతల ఒత్తిడితో అర్బన్ బ్యాంక్ ప్రాంగణంలో కూర్చోవాల్సి వచ్చిందని ఆరోపిస్తున్నారు.
రథోత్సవం ప్రారంభం కాకముందే వేదిక కుంగిపోవడంతో భక్తులు, రాజకీయ నాయకులు తృటిలో తప్పించుకున్నారు. ఆధ్యాత్మిక వేడుకలో రాజకీయ కలహాలు చోటుచేసుకోవడం పట్ల భక్తులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.








