ఆసియా కప్ (Asia Cup) లో జోరు మీదున్న టీమిండియా (Team India)కు కొత్త స్పాన్సర్ (New Sponsor) లభించింది. గతంలో టీమిండియా జెర్సీ స్పాన్సర్ (Jersey Sponsor)గా ఉన్న డ్రీమ్ 11 స్థానంలో ఇప్పుడు అపోలో టైర్స్ రానుంది. ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన గేమింగ్ బిల్లు కారణంగా డ్రీమ్ 11 (Dream 11) వైదొలగడంతో, ఆసియా కప్‌లో తొలి రెండు మ్యాచ్లలో భారత జట్టు స్పాన్సర్ లేకుండానే బరిలోకి దిగింది.
ఒక్కో మ్యాచ్‌కు రూ.4.5 కోట్లు
తాజా సమాచారం ప్రకారం, బీసీసీఐతో అపోలో టైర్స్ (Apollo Tyres) చేసుకున్న ఒప్పందం 2027 వరకు కొనసాగుతుంది. ఈ కాలంలో భారత జట్టు సుమారు 130 మ్యాచ్‌లు ఆడుతుంది. అపోలో టైర్స్ ఒక్కో మ్యాచ్‌కు దాదాపు రూ.4.5 కోట్లు చెల్లించనుంది. ఇది గతంలో డ్రీమ్ 11 చెల్లించిన రూ.4 కోట్ల కంటే రూ.50 లక్షలు ఎక్కువ.
పోటీలో గెలిచిన అపోలో
భారత క్రికెట్ జెర్సీ స్పాన్సర్‌షిప్ కోసం జరిగిన పోటీలో కాన్వా, జేకే టైర్ వంటి సంస్థలను ఓడించి అపోలో టైర్స్ ఈ ఒప్పందాన్ని సొంతం చేసుకుంది. బిర్లా ఆప్టస్ పెయింట్స్ కూడా స్పాన్సర్‌గా ఆసక్తి చూపించినప్పటికీ, బిడ్ వేయడానికి ముందుకు రాలేదు.







