అనుష్క నటించిన ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ రెండేళ్ల క్రితం సూపర్ హిట్ అయినప్పటికీ, ఆమె ఆచితూచి సినిమాలు చేస్తున్నారు. ‘భాగమతి’ తర్వాత మరో లేడీ ఓరియెంటెడ్ సినిమాలో నటించడానికి స్వీటీ సిద్ధమయ్యారు. గతంలో ఆమెకు ‘వేదం’ వంటి విజయాన్ని అందించిన దర్శకుడు క్రిష్‌తో కలిసి ఆమె ‘ఘాటీ’ సినిమా చేస్తున్నారు.
ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ సమర్పణలో రాజీవ్ రెడ్డి, సాయిబాబా నిర్మిస్తున్నారు. ఈ నెల 5న ఈ సినిమా విడుదల కానుంది.
సినిమాలో ఏముంది?
ఈ సినిమా గురించి టాలీవుడ్‌లో ఆసక్తికరమైన వార్తలు వినిపిస్తున్నాయి. అందుతున్న సమాచారం ప్రకారం, సినిమా మొదటి సగం రోలర్ కోస్టర్ లా సాగుతుంది. హై-ఆక్టేన్ రైల్వే స్టేషన్ సన్నివేశం, గుహలో సాగే ఫైట్ ప్రేక్షకులకు థ్రిల్ అందిస్తాయని తెలుస్తోంది. ఇంటర్వెల్ ఒక పెద్ద ట్విస్ట్ ఇస్తుందని, అయితే కథనం కొంచెం నెమ్మదిగా సాగుతుందని సమాచారం.
ఇక రెండో సగంలో కథలోని ప్రధాన భాగం మొదలవుతుంది. ఒక బాధితురాలి నుండి నేరస్థురాలిగా, ఒక పురాణగాథగా మారిన శీలవతి పాత్రలో అనుష్క నటన ప్రేక్షకులకు గూస్‌బంప్స్ కలిగిస్తుందని అంటున్నారు. సినిమా చూసిన తర్వాత ప్రేక్షకులు “స్వీటీ నుంచి ఒక అద్భుతమైన సినిమా చూశాం” అనే ఫీలింగ్‌తో బయటకు వస్తారని టాక్.
భావోద్వేగాలతో కూడిన కథ, యాక్షన్, అలాగే అనుష్క అద్భుతమైన నటన ఈ సినిమాను హిట్ చేస్తాయని తెలుస్తోంది. వేదం సినిమాలో చూపించిన దానికి భిన్నంగా, స్వీటీ అంటే కేవలం స్వీట్ కాదు అని కత్తి పట్టి వీరవిహారం చేసిన తీరు ప్రేక్షకులను మెప్పిస్తుందని సమాచారం.
ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని U/A సర్టిఫికేట్ పొందింది. 2 గంటల 37 నిమిషాల నిడివితో మరి కొన్ని గంటల్లో ‘ఘాటీ’ విడుదల కానుంది.








