వివిధ జిల్లాల్లో తీవ్ర ఎండలతో కొట్టుమిట్టాడుతున్న ఆంధ్రప్రదేశ్‌కు వర్షాలు మళ్లీ పునరాగమనం చేయబోతున్నాయి. వారం రోజులుగా వర్షం లేని వాతావరణం తర్వాత మరోసారి వరుణుడు కరుణించబోతున్నాడని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిక జారీ చేశారు.
రాయలసీమ, కోస్తాలో భారీ వర్ష సూచన
ఆగస్టు 4వ తేదీ నుంచే రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. మూడు రోజులపాటు వర్షాల ప్రభావం కొనసాగే ఛాన్స్ ఉందని తెలిపారు. వర్షాల ప్రభావంతో లోతట్టు ప్రాంతాల్లో జలమయం కావడం, ట్రాఫిక్ స్ధంభించడం వంటి పరిణామాలకు సిద్ధంగా ఉండాలని సూచిస్తున్నారు.
తెలంగాణలోనూ వర్ష సంకేతాలు
పొరుగు రాష్ట్రం తెలంగాణలోనూ ఆగస్టు 5 నుంచి వర్షాలు కురిసే సూచనలు కనిపిస్తున్నాయి. హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఈ మేరకు కీలక సమాచారం విడుదల చేసింది. ఇంతలో శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. జలనిర్వహణ శాఖ అధికారులు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పరిసర ప్రాంతాల్లో నివసించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.