జాతీయ కోచ్ పదవి కోసం ఎన్నిసార్లు అభ్యర్థించినా షూటింగ్ సమాఖ్య తనను పట్టించుకోవట్లేదని ఒలింపిక్ రజత పతక విజేత, షూటర్ విజయ్ కుమార్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తన ఘనతను పరిగణనలోకి తీసుకుని, వచ్చే తరం షూటర్లను తీర్చిదిద్దడానికి తనకు అవకాశమివ్వాలని కోరుతూ జాతీయ షూటింగ్ సమాఖ్య (ఎన్‌ఆర్‌ఏఐ) అధ్యక్షుడు కలికేశ్ సింగ్‌కు ఆయన ఒక లేఖ రాశారు.
విజయ్ కుమార్ ఆవేదన
“అంతర్జాతీయ అనుభవం లేని, పెద్దగా ప్రదర్శన చేయని వాళ్లను కోచ్‌లుగా నియమిస్తూ తనను విస్మరించడం బాధించిందని” విజయ్ తన లేఖలో పేర్కొన్నారు. తాను చాలా మంది ఎన్‌ఆర్‌ఏఐ సెలక్షన్ కమిటీ సభ్యులను కలిశానని, అయితే వారి నుంచి ఎలాంటి సంతృప్తికర సమాధానం రాలేదని తెలిపారు. “ఫిబ్రవరిలో భారత పిస్టల్ షూటింగ్ జట్టు కోచ్ పదవికి సెలక్షన్ కమిటీ నన్ను విస్మరించడంతో నేను మిమ్మల్ని సంప్రదించా. నిర్ణయాన్ని తిరిగి సమీక్షిస్తానని చెప్పారు. నన్ను ఎంపిక చేయకపోవడానికి కారణాలు తెలుసుకోవడం కోసం ఎన్‌ఆర్‌ఏఐ కార్యదర్శి, సెలక్షన్ కమిటీ సభ్యులను కలిశా. కానీ వారి నుంచి ఎలాంటి సంతృప్తికర సమాధానం రాలేదు” అని లేఖలో విజయ్ కుమార్ వివరించారు. ఎంపికైన కొందరు కోచ్‌లకు డోపింగ్ లేదా క్రమశిక్షణ తప్పిన చరిత్ర ఉందని కూడా ఆయన ఆరోపించారు.
ఎన్‌ఆర్‌ఏఐ అధ్యక్షుడి స్పందన
అయితే, విజయ్ లేఖ గురించి తనకు తెలియదని ఎన్‌ఆర్‌ఏఐ అధ్యక్షుడు కలికేశ్ సింగ్ అన్నారు. కోచ్ పదవికి విజయ్ అర్హుడని, ఆసియా ఛాంపియన్‌షిప్స్ (ఆగస్టు 16-30) తర్వాత కొత్త కోచ్‌ల నియామకం ఉంటుందని ఆయన పేర్కొన్నారు.








